ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

– ఆర్టీసీలో 6వేల మంది తాత్కాలిక సిబ్బంది నియామకం
– 4వేలమంది డ్రైవర్లు…2వేల మంది కండక్టర్లు
– ప్రగతి భవన్‌ నుంచే ఆర్టీసీపై పర్యవేక్షణ
హైదరాబాద్‌,అక్టోబర్‌ 5(జనంసాక్షి): తాత్కాలిక ప్రాతిపదికన ఆర్టీసీ 6 వేల నియామకాలను చేపట్టింది. 4 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్ల నియామకం చేపట్టనున్నారు. ఆదివారం నుండి పూర్తిస్థాయిలో బస్సుల్ని నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. ఇంత వరకు ఒక్క కార్మికుడు కూడా విధుల్లో చేరలేదని, సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమ్మె చేసే కార్మికులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది. విధుల్లో చేరినవారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్మికసంఘాలతో చర్చలు జరపవద్దని, ప్రభుత్వం నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీని ప్రభుత్వం రద్దు చేసింది. రవాణాశాఖ కమిషనర్‌గా సందీప్‌ సుల్తానియా నియామించారు. దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో తెలంగాణ ప్రభుత్వం దానికి ధీటుగా ప్రణాళికలు రచిస్తోంది. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దూకుడు పెంచింది.  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగనిరీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే వేగంగా నియామకాలను చేపడుతోంది.  ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని మరోసారీ టీఎస్‌ సర్కారు తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఒకే రోజు  దాదాపు నాలుగువేలకు పైగా డ్రైవర్లు, రెండు వేలకు పైగా కండక్టర్లను నియమించింది. నియామకాల పక్రియ ఇంకా కొనసాగుతోంది. సర్కారు విధించిన గడవుకు సమయం దగ్గరపడుతుండటంతో విధుల్లో చేరని వారిపై వేటు అప్పదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది. ముఖ్యమంత్రి  అధికార నివాసం ప్రగతి భవన్‌ నుంచే ఆపరేషన్‌ ఆర్టీసీని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని  రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.  మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం, ఆర్టీసీ బస్సులు నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం.. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యధావిధిగా నడపడం తదితర చర్యలను తీసుకోనున్నట్టు ఆయన వివరించారు. సమ్మెను ఎదుర్కోవడంలో భాగంగా ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తోందని, ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సవిూక్షను ప్రభుత్వం నిర్వహించి.. ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుందని ఆయన వెల్లడించారు.  సమ్మెపై సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ ఎప్పటికప్పుడు సవిూక్ష నిర్వహిస్తున్నారు.