ప్రత్యూష బాధ్యతలు నేను తీసుకుంటా

5

– ముందుకొచ్చిన సీఎం కేసీఆర్‌

– నేడు కుటుంబసమేతంగా ప్రత్యూషను కలువనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌,జులై17(జనంసాక్షి):  సవతి తల్లి దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రత్యూష దీనస్థితిని,ఆమె పడుతున్న వేదనను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చలించిపోయారు. ప్రత్యూషకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని..ఆమెకు సంబంధించిన అన్ని బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ప్రత్యూషకు మెరుగైన వైద్య సేవలందించడం, ప్రత్యూషకు కావాల్సిన అన్ని అవసరాలు సమకూర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రత్యూషకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవేర్‌ గ్లోబల్‌ చికిత్స పొందుతున్న ప్రత్యూషను రేపు ఉదయం 9గంటలకు సీఎం కేసీఆర్‌ దంపతులు కలువనున్నారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిని సీఎం దగ్గరుండి వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. రెండు సంవత్సరాలుగా తండ్రి, సవతి తల్లి ఇద్దరు ప్రత్యూషపై వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా

పినతల్లి, తండ్రి చిత్రహింసలకు చావు అంచుల వరకు వెళ్లిన ప్రత్యూష కేసుని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. ప్రత్యూష సంరక్షణకు ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. ప్రత్యూష పెద్దమ్మ, పెద్దనాన్నతో ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నది. ప్రత్యూష పిన్ని చాముండేశ్వరి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యూష తండ్రి రమేష్‌ జీతం, ఆస్తుల వివరాలపై కోర్టు ఆరా తీసింది. ప్రత్యూష తండ్రి రమేష్‌, మేనమామను సోమవారం కోర్టులో హాజరుపర్చాలని ఎల్బీ నగర్‌ పోలీసులను ఆదేశించింది. ప్రత్యూషతో తామే స్వయంగా మాట్లాడుతామని, సోమవారం కోర్టుకు తీసుకురావాలని త్రిసభ్య ధర్మాసనం పోలీసులకు ఆదేశించింది. ప్రత్యూషపై పినతల్లి, తండ్రి హింసలను విూడియాలో చూసిన హైకోర్టు, సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీర్పును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.