ప్రత్యేకాధికారుల పాలనకే ప్రభుత్వం మొగ్గు
సర్పంచ్ల పదవీకాలం పూర్తి కానుండడంతో ప్రత్యేకాధికారుల పాలనకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదశాలు కూడా ఇచ్చారు. ఇటీవలే చీఫ్ పెక్రటరీ కూడా దీనిపై కలెక్టర్లతో చర్చించి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గతంలో 2011 నుంచి 2013 జూలై వరకు రెండేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. తాజాగా ఆగస్టు 2 నుంచి ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 జూలైలో ఎన్నికలు నిర్వహిం చారు. ఐదేండ్ల కోసం ఏర్పాటైన పాలక వర్గాలకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. దీంతో సర్పంచ్ల స్థానే ప్రత్యేక అధికారుల పాలన రానుంది. అయినా సర్పంచ్‌లలో మాత్రం ఇంకా ఆశ చావడం లేదు. తమనే కొనసాగించాలని ఆయా జిల్లాల్లో ఎంపిలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలసి వినతి పత్రాలు ఇస్తున్నారు. సుమారు నాలుగేళ్ల పాటు ప్రభుత్వానికి సహకరించిన సర్పంచ్‌లను పర్సన్ ఇంచార్జిలుగా నియమించా లన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరుతున్నారు. తొలుత డిప్యూటి సిఎం కడియం శ్రీహరిని కలసి సర్పంచ్ల సంఘం వినతిపత్రం సమర్పించింది. అయినా ఫలితం లేకుండా ఆపోయింది. ఎంపి కవితను కూడా కలసి వినతి పత్రం సమర్పించారు. ఈనెల 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుం డడంతో ప్రస్తుతం సర్పంచ్‌లుగా విధులు నిర్వహిస్తున్న వారినే పర్సన్ ఇన్చార్జిలుగా నియమించాలని సర్పంచ్ల ఫోరం నేతలు ఆయా జిల్లాల్లో కోరుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచామని సర్పంచ్‌లు అంటున్నారు. అనేక గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు టీఆర్ఎస్కు చెందిన వారేనని సర్పంచ్‌లే నని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరవేశామన్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, బతుకమ్మచీరల పంపిణీ, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ వంటి పథకాలను విజయవంతం చేశామని తెలిపారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాతే సర్పంచ్‌లకు నిధులు విడుదల అయ్యాయన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేనందున ప్రత్యేక అధికారులను నియమించకుండా సర్పంచ్‌లకే పర్సన్ ఇన్చార్జిలుగా నియమించాలన్నారు. జూలై 31 నాటికి గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు గడువు తీరనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అటు ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ప్ర భుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. బీసీ జనగణన మళ్లీ చేయాల్సి రావడం.. ఆ ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉండడం.. ఇంతలో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు కావడంతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31న పాలక వర్గాలకు గడువు తీరడంతో పల్లెల్లో పర్యవేక్షణ బాధ్యతలను ప్రత్యేకాధికారులకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యేకాధికారులను నియమించ నున్నారు. ఆగస్టు 2 నుంచి పాత, కొత్త గ్రామ పంచాయతీలకూ మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధి కారులుగా నియమించాలని ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం చేస్తుండగా ఈ నెల 25న తుది ఉత్తర్వులు వెలువడ నున్నాయి. మండల స్థాయి అధికారులైన ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఈవో, ఏవో, పశువైద్యాధికారి,
పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలను ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. మండల స్థాయి అధికారులతో పాటు ఏఈవోలు, డీటీలకు కూడా ప్రత్యేకాధికారుల బాధ్యతలు అప్పగించనున్నారు. సర్పంచ్ నిర్వహించే అన్ని రకాల విధులు, బాధ్యతలు, అధికారాలను ప్రత్యేకాధికారులకు అప్పగించనున్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరా, ఇతర అన్ని పనులను ప్రత్యేకాధికారులకు అప్పగిస్తారు. రెగ్యూలర్‌గా వచ్చే నిధులు, పన్నుల వసూళ్లు కూడా ప్రత్యేకాధికారులకే అప్పగిస్తారు. గ్రామాల్లోని కార్యదర్శి ప్రత్యేకాధికారి పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో పూర్తి పర్యవేక్షణ వీరికే ఉండనుంది. సర్పంచులకు ఉండే అన్ని బాధ్యతలు, అధికారాలు ప్రత్యేకాధికారులకు ఉంటాయి. ఏయే గ్రామానికి ఎవరెవరిని ప్రత్యేకాధికారిగా నియమించాలనే విషయంపై ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో కసరత్తు నడుస్తోంది. ఈ ప్రతిపాదనలను మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌కు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకాధికారుల నియామకాన్ని కలెక్టర్ చేయనున్నారు. ఈ కసరత్తు పూర్తి చేసి ఈ నెల 25లోగా నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో సిఎం కెసిఆర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని భావించడం లేదు. అధికారుల చేతికి పగ్గాలు అప్పగించడం ద్వారా నూతన పంచాయితీ చట్టాన్ఇన పక్కాగా అమలు చేసేలా చూస్తున్నారు. దీనికితోడు పంచాయితీల్లో ఖర్చులు కూడా కలసి రాగలవని భావిస్తున్నారు. మరోవైపె ఎన్నికలను ఎప్పటిలోగా పూర్తి చేయగలమో అన్నది తెలియడం లేదు. ఈ దశలో సర్పంచ్‌లనే ప్రత్యేక పాలకులుగా ఎంతకాలమని మోస్తారు. ఇది కూడా రాజ్యాంగ పరంగా చిక్కులు తేనుంది. అందుకే ప్రత్యేకాధికారుల పాలనకే సిఎం మొగ్గు చూపారు. దీంతో సర్పంచ్‌లను కొనాగించే అంశం ఇక పరిశీలనలో లేనట్లుగానే భావించాలి.