ప్రధానికి గుజరాత్‌ భయం పట్టుకుంది: రాజ్‌ థాకరే

ముంబయి,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో విపక్షాలు పటిష్టమవుతాయని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ థాకరే అన్నారు. గుజరాత్‌ ఎన్నికల కోసం ప్రధాని సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోదని ఎద్దేవా చేశారు. చూస్తుంటే అక్కడ ఓటమి భయంపట్టుకుందా అని అని ఆయన అన్నారు. ప్రతిపక్షం కొంత బలహీనంగా ఉందనేది వాస్తవం..అయితే గుజరాత్‌ ఎన్నికల తర్వాత బలోపేతమవుతుంది..విపక్షంలో గణనీయ మార్పు గమనిస్తారని థాకరే అన్నారు. కేవలం ఒకే రాష్ట్రంలో ప్రధాని సహా పలువురు మంత్రులు ర్యాలీలు నిర్వహిస్తుండం ఆశ్యర్యకరమన్నారు. ప్రధాని సొంత రాష్ట్రమే అయినా దేశాధినేత ఒకే రాష్ట్రంలో అంతగా దృష్టి కేంద్రీకరించడం సరైంది కాదని ఆక్షేపించారు. గుజరాత్‌లో పాలక బీజేపీ ప్రజలకు మేలు చేకూర్చి ఉంటే ఇంతమంది మంత్రులు పార్టీ కోసం ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నోట్లను ముద్రించిందని, ఇది బీజేపీకి లాభం చేకూర్చిందని ఆయన ఆరోపించారు.బీజేపీ మినహా మరే రాజకీయ పార్టీకి అన్ని నిధులు లేవని, బీజేపీకి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా సమకూరాయని థాకరే ప్రశ్నించారు.