ప్రధాని పచ్చి అబద్ధాలు
` ఆయన యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు ఖాయం!
` మోడీ స్క్రిప్ట్ రాస్తే సినిమా కచ్చితంగా హిట్టవుతుంది
` నేను సీఎం కావడానికి ఆయన అనుమతి అక్కర్లేదు
` మునిగిపోయే ఎన్‌డీయే నావను ఎక్కాలని ఎవరూ అనుకోరు
` నిజామాబాద్‌లో ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ధ్వజం
జగిత్యాల ప్రతినిధి/సిరిసిల్ల బ్యూరో (జనంసాక్షి):ఎన్‌డీయేలో కలవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నించారని ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మరొకసారి ఫైర్ అయ్యారు. మునిగిపోయే నావ ఎన్‌డీయే కలవాలని ఎవరూ అనుకోబోరని, ఇప్పటికే ఎన్‌డీయే కూటమి నుంచి ఎన్నో పార్టీలు బయటకు వచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధి గురించి తెలుసుకోకుండా ఆయన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని విమర్శించారు. ఆ స్థాయిలో ఉన్నవ్యక్తి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమని, ఇకపై ఎవరైనా ప్రధానిని కలిస్తే సంభాషణను రికార్డు చేసుకుంటే మంచిదని సూచించారు. ప్రధాని మోడీ యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు తప్పకుండా వస్తుందని ఎద్దేవా చేసిన మంత్రి కేటీఆర్.. ఆయన స్క్రిప్టు రాస్తే సినిమా బాగా హిట్టవుతుందని చమత్కరించారు. ఎన్‌డీయే వీడిన పార్టీలపైకి ఈడీ, సీబీఐని పంపుతున్నారని, బీజేపీతో కలిసినవారికి మాత్రం కేసులు కూడా మరుగున పడిపోతాయని అన్నారు. తెలంగాణకు ఈ తొమ్మిదేళ్లలో ఏం ఇచ్చారో మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటివేవీ వెల్లడిరచకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనను ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్.. మోడీని కోరలేదని, అయినా తాను సీఎం అయ్యేందుకు మోడీ అనుమతి అక్కర్లేదన్నారు. ప్రస్తుతం ఎన్‌డీయే కూటమిలో సీబీఐ, ఈడీ, ఐటీ మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
(మంత్రి కొప్పుల కష్టజీవి
కష్టకాలంలో ఉన్నప్పటికీ పార్టీతోనే ఆయన ప్రయాణం
సంజయ్‌ను గెలిపిస్తే యూజీడీ మంజూరు
జగిత్యాల, ధర్మపురి సభల్లో మంత్రి కేటీఆర్
జగిత్యాల ప్రతినిధి (జనంసాక్షి) : పార్టీ ఉన్నంతవరకూ పార్టీ మారబోనని దశాబ్దంన్నర క్రితమే మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారని, సింగరేణి కార్మికుడిగా పనిచేసిన ఆయన పార్టీ ఏ స్థితిలో ఉన్నా తమతోనే ఉన్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. కష్టాల్లో ఉన్నప్పుడే మనతో ఉన్నవారే అసలైనోళ్లు అని గుర్తుచేశారు. ధర్మపురిలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆయనెంతో కృషి చేస్తే.. రాజకీయ దురుద్దేశంతో అడ్డుకున్నారని అన్నారు. అంతకుముందు జగిత్యాల సభలో మాట్లాడుతూ.. దేశంలో మోదీ మాటలు కోట్లల్లో ఉంటాయని, పనులు పకోడంతా అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లాలోని జిల్లా ఎస్పీ కార్యాలయం సమీకృత మార్కెట్ నూక పెళ్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, మినీ స్టేడియంలో బహిరంగ సభలో మాట్లాడారు. జగిత్యాల జీవన్ రెడ్డి గతం అని రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం అని అభివర్ణించారు. జగిత్యాల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్‌ను మరోసారి గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకాన్ని మంజూరు చేస్తామన్నారు. జగిత్యాలలో గతంలో పనిచేసిన మంత్రులు చేయని పనులు కూడా అనుభవం లేని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేశారని అన్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు సమయంలో కొంతమంది అడ్డు తగిలి రైతులను రెచ్చగొట్టారన్నారు. మాస్టర్ ప్లాన్ అమలచేసే బాధ్యత నాదని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సంజయ్ కుమార్ ను ఒకసారి గెలిపిస్తేనే జిల్లా వచ్చింది. మెడికల్ కాలేజీ, ఎస్పీ కార్యాలయం నాలుగువేల డబుల్ బెడ్ రూమ్‌లు జగిత్యాల ప్రజలకు అందజేశారన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రేవంత్..
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు. ఒక ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడిని తీసుకొచ్చి తెలంగాణ పిసిసి అధ్యక్షులు చేశారని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ సోనియా గాంధీకి ఉత్తరం రాశారన్నారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డిని ఇలా పిసిసి ఇచ్చారని ప్రశ్నించారు. బిజెపికి టిఆర్‌ఎస్ కు సంబంధం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందన్నారు.
గుడిసెలేని ‘సిరిసిల్ల’ నా ధ్యేయం
` సీఎం కాళ్లు మొక్కైనా గృహలక్ష్మీ మంజూరు చేయిస్తా
` మంత్రి కేటీఆర్ ఉద్వేగపూరిత ప్రసంగం
రాజన్న సిరిసిల్ల బ్యూరో (జనంసాక్షి):రాష్ట్రంలో గుడిసెలేని తొలి నియోజకవర్గం సిరిసిల్ల కావాలన్న లక్ష్యంతోనే పనిచేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. మిగిలిపోయిన కొద్దిమందికి సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా గృహలక్ష్మి మంజూరు చేస్తామని ఉద్వేగ భరితంగా అన్నారు. రాజన్న సిరిసిల్ల పరిధిలో డబల్ బెడ్ రూమ్ గృహలక్ష్మి లబ్ధిదారులకు గుర్తింపు పత్రాలను అందించేందుకు కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నియోజకవర్గంలో గుడిసెలు ఇండ్లు లేని శిథిలావస్థలో ఉన్న 1774 మందిని గుర్తించి ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గలాస్ పరిధిలో కల్పతరువు లాంటి మల్కాపేట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయని త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనునట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక చేయుత, పట్టాల పంపిణీ గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రోసిడిరగ్ కాపీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, పవర్ లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ,కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొన్నారు.