ప్రధాని మోదీని కలిసిన ఫాదర్‌ టామ్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 28,(జనంసాక్షి): యెమెన్‌లో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా బయటపడిన కేరళకు చెందిన ఫాదర్‌ టామ్‌ ఉజున్నలీల్‌ గురువారం స్వదేశానికి వచ్చారు. గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్న టామ్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా టామ్‌కు మోదీ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తనను సురక్షితంగా విడిపించినందుకు టామ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 2016 మార్చిలో యెమెన్‌లోని అడిన్‌ నగరంలో స్థానిక మిషనరీలు నిర్వహిస్తున్న ఓ వృద్ధాశ్రమంపై నలుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఆశ్రమంలోని ఓ వ్యక్తి బంధువులమని చెప్పి లోపలికు వచ్చిన ముష్కరులు అక్కడి వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో టామ్‌ను కిడ్నాప్‌ చేశారు. దాదాపు 18 నెలల తర్వాత టామ్‌ ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా విడుదలైనట్లు ఇటీవల సుష్మాస్వరాజ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి విడుదలైన టామ్‌ను మస్కట్‌ తరలించి.. అక్కడి నుంచి ఢిల్లీకి చేర్చారు. దీంతో గురువారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు. ఫాదర్‌ టామ్‌ స్వస్థలం కేరళలోని కొట్టాయం.