ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్ నవాబ్ జంగ్
– మంత్రి హరీష్
హైదరాబాద్,జులై11(జనంసాక్షి):
నవాజ్ జంగ్ ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీరని ఆయన కృషి వల్ల తెలంగాణలో నీటి ప్రాజెక్టులు ఏర్పడ్డాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అన్ని శాఖల ఇంజినీర్లు సమన్వయంతో పనిచేయాలని హరీష్ రావు చెప్పారు. హైదరాబాద్ లో ఇంజినీర్ల సంఘానికి 2వేల గజాల స్థలంలో భవనం కట్టిస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
తెలంగాణ ఇంజినీర్లతోనే పనులు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా నాలుగేండ్లలో అనుకున్న పనులన్నీ పూర్తి చేసేందుకు ఇంజినీర్లు కృషి చేయాలన్నారు.రాష్ట్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగరరావు, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఇంజనీర్స్ ను ఘనంగా సత్కరించారు.
సీఎం కేసీఆర్ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు
తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. జాతి సంపద సృష్టిలో, కొత్త ఆవిష్కరణలలో ఇంజనీర్లది ముఖ్య పాత్ర అని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఇంజనీర్లు అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తెలంగాణలో పలు ప్రాజెక్టులకు డిజైన్ చేసిన నవాజ్ జంగ్ జయంతి రోజైన జులై 11న తెలంగాణ ఇంజనీర్స్ డే గత ఏడాది నుంచి జరుపుకుంటున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.