ప్రపంచ బ్యాంక్‌ విధానాల వల్ల కాంట్రాక్టు ఉద్యోగుల ఇక్కట్లు

ఆదిలాబాద్‌, జనవరి 29 (): ప్రభుత్వాలు  ప్రపంచ బ్యాంక్‌ విధానాలను అవలంభించడం వల్లన ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బందుల పాలవుతున్నారని ఎఐటియుసి అనుబంధ మెడికల్‌ ఒప్పంద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాములు అన్నారు. ఒప్పంద కార్మికులకు, ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన  వేతనాలు చెల్లించడంతో పాటు సెలవులను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయాలని, అదే విధంగా  కాంట్రాక్టు విధానంలో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఫిబ్రవరి 11 నుంచి 22వ తేదీ వరకు  ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని, దేశవ్యాప్తంగా చేపట్టే 48గంటల సమ్మెను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.