మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం
హవాయ, సెప్టెంబర్04 (జనంసాక్షి) : అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయలో అగ్నిపర్వతం బద్ధలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన ‘కిలోవేయ’ మరోసారి విస్ఫోటనం చెందింది. దాని నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తోంది. సుమారు 100 మీటర్ల ఎత్తు వరకూ లావా ఎగసిపడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోని యూఎస్ జియోలాజికల్ సర్వే సోషల్ మీడియాలో పోస్టు చేసింది.హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ‘కిలోవేయ’ ఒకటి. ఇది హోనోలులుకు దక్షిణంగా దాదాపు 200 మైళ్ల దూరంలో ఉన్నది. యూఎస్ జియోలాజికల్ ప్రకారం ప్రకారం ఇది సెకనుకు సగటున 6,750 క్యూబిక్ అడుగుల లావాను ఉత్పత్తి చేస్తుందని అంచనా. తొలుత మంగళవారం విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం.. బుధవారం మరోసారి బద్ధలై పెద్దఎత్తున లావాను వెదజల్లింది. కాగా, ఈ ఏడాది మార్చిలో కూడా రెండుసార్లు ఈ అగ్నిపర్వతం బద్ధలైన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం డిసెంబర్ నుండి ఇది 32వ సారికావడం గమనార్హం. అయితే, ఈ పర్వతం ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల ప్రజలకు ఎలాంటి ముప్పూ లేదని అధికారులు పేర్కొంటున్నారు.