చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి
` యూరోపియన్ నేతలను కోరిన ట్రంప్
` అమెరికాలో ఇక ‘యుద్ధ మంత్రిత్వ శాఖ’..
వాషింగ్టన్(జనంసాక్షి):రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలను కోరారు. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించడం ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని వాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిచ్చిన పారిస్ సదస్సు అనంతరం ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న మిత్రదేశాల కూటమి ‘కొలిషన్ ఆఫ్ ది విల్లింగ్’తో వీడియో కాల్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల భారత ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో సుంకాల భారం 50%కు రెట్టింపు అయింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈమేరకు సుంకాలు విధించినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్ కూడా భారీగానే రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆ దేశపు చమురు కొంటూ యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తున్నాయన్నారు. యూరప్ ఓ వైపు యుద్ధం ఆపాలంటూ, మరో వైపు చమురు కొనుగోళ్ల రూపంలో రష్యాకు నిధులు సమకూర్చడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గత ఏడాది కాలంలో ఇంధన అమ్మకాల ద్వారా ఈయూ 1.1 బిలియన్ యూరోలను రష్యాకు ముట్టజెప్పిందని అంతర్గత డేటాను ట్రంప్ ఉదహరించారు. అయితే కొన్ని ఈయూ దేశాలు 2022లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను, 2023 నాటికి శుద్ధి చేసిన ఇంధనాన్ని నిలిపివేయగా హంగేరి, స్లొవేకియా పరిమిత దిగుమతులను కొనసాగిస్తున్నాయి.
అమెరికాలో ఇక ‘యుద్ధ మంత్రిత్వ శాఖ’..
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిపాలన, ఇతర దేశాలతో సంబంధాలు, పన్నుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దేశంలోని పలు విభాగాలు, పాలనా పరమైన అంశాల్లో అనేక మార్పులు చేశారు. తాజాగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ పేరుతో మంత్రిత్వ శాఖ ఉండగా.. 1947 క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ పేరును అగ్రరాజ్యం తొలగించింది. మళ్లీ దానిని పునరుద్ధరిస్తూ.. పెంటగాన్ పేరు మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు సిద్ధమయ్యారు.‘‘పీట్ హెగ్సెత్ తరచూ అమెరికా రక్షణశాఖ అంటూ సంబోధిస్తుంటారు. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. రక్షణ అనే పదం ఎందుకు? గతంలో పిలిచినట్లుగానే ఇకపై ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ అని పిలుద్దాం. అది ఎంతో శక్తిమంతమైన పదం. అదే శక్తితో గతంలో అమెరికా మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో విజయం సాధించింది. ప్రతి విషయంలోనూ ముందంజలో నిలిచింది. ఇప్పుడు కూడా అదే పేరుతో మరింత ముందుకు వెళ్దాం’’ అని ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో మాట్లాడారు. దీనికి ట్రంప్ పాలకవర్గ సభ్యులు కూడా మద్దతునిచ్చారు. దీంతో ఈ పేరు మార్పుపై త్వరలోనే ప్రకటన వెలువడనుంది.1789లో అమెరికా యుద్ధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. యూఎస్ సైనిక, నావికా దళాలకు నాయకత్వం వహించేందుకు ఓ యుద్ధ కార్యదర్శి ఉండేవారు. అనంతరం 1798లో ప్రత్యేక నేవీ విభాగాన్ని నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత .. 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం.. క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ‘జాతీయ సైనిక సంస్థ’ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సైన్యం, వైమానిక దళ విభాగాలను రూపొందించారు. 1949లో సైన్యంలోని త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ.. జాతీయ సైనిక సంస్థ పేరును రక్షణ శాఖగా మార్చారు. ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖ మంత్రిగా పీట్ హెగ్సెత్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.