యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీ హైడ్రామా
సెప్టెంబర్ 05(జనంసాక్షి):హైదరాబాద్: యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌మండిపడ్డారు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఇరుపార్టీలు రాష్ట్ర రైతులను వంచిస్తున్నాయని విమర్శించారు. నాట్లు వేసి నెల రోజులైనా యూరియా ఇవ్వడం లేదని చెప్పారు. యూరియా కొరత లేదని సీఎం రేవంత్ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా రైతుల ధర్నాలు, రాస్తారోకోలు కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రోమోర్ సెంటర్‌పై మహిళారైతులు దాడిచేశారన్నారు. ముఖ్యమంత్రికి కళ్లుంటే చూడాలని మండిపడ్డారు.
రాష్ట్రంలో వర్షాకాలానికి 15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, కేంద్రం కేటాయించింది మాత్రం 8.36 లక్షల మెట్రిక్ టన్నులేనని చెప్పారు. ఇప్పటివరకు వచ్చింది 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఏమీ తెలియనట్టే నటిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఏనాడూ ఎరువుల కొరత రాలేదని చెప్పారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. కేసీఆర్ ఏప్రిల్, మే నెలల్లోనే ఎరువులపై సమీక్ష జరిపేవారని గుర్తుచేశారు. అసరమైన ఎరువులను ముందే బఫర్ స్టాక్ పెట్టించేవాళ్లని తెలిపారు. సీఎం, మంత్రులు బడాయి మాటలు తప్ప చేస్తున్నదేం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాతరోజులు తెస్తామని చెప్పిందని, అన్నట్లుగానే మళ్లీ ఆ రోజులు తీసుకొచ్చిందన్నారు. యూరియా కొరత, పోలీసులను పెట్టి ఎరువులు సరఫరా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు గుడ్డిగుర్రాలకు పండ్లు తోముతున్నారా అని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారు. పెద్దపల్లి నుంచి ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ ఏ చేస్తున్నారని నిలదీశారు. కనీసం బుద్ధి లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. దమ్మూ, ధైర్యం ఉంటే కిలో కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.