రేపు వినాయక నిమజ్జనం
హైదరాబాద్:సెప్టెంబర్ 05(జనంసాక్షి):నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య.. ఇక గంగమ్మ ఒడికిచేరనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి సహా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గణనాథులు ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ చరువు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు చెరువుల్లో నిమజ్జనం కానున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తామన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలామైదాన్ నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. టప్పచబుత్ర, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్‌లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు.
సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులు ఉంటాయి. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దరుశ్షిఫా ప్రాంతాలలో ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసిఏ ప్రాంతాలలో ఆంక్షలు అమలులో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించరు.
నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారు.
సెప్టెంబర్ 6న ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7న రాత్రి 11 వరకు నగరంలోకి లారీల ప్రవేశం ఉండదు. రద్దీ సమయంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులను చాదర్‌ఘాట్ వైపు దారి మళ్లిస్తారు.
ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లను దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్‌ను మాత్రమే ఉపయోగించాలని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లేవారు బేగంపేట-పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఏదైనా సహాయం, సమాచారం కోసం ప్రజలు 040-27852482, 8712660600, 9010203626 నంబర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు.