ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా జయంతిని పురస్కరించుకుని
ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మండేలా గౌరవార్ధం ఆయన పుట్టినరోజున వేడుకలు నిర్వహించాలని 2009, నవంబరు 10న ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న 192 మంది సభ్యులు ఆమోదించారు. దీంతో ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌ అలీ ట్రెకి తీర్మానించారు. 2009, ఏప్రిల్‌ 27న నెల్సన్‌ మండేలా ఫౌండేషన్‌ వారు మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంకోసం ప్రపంచ దేశాల మద్దతును ఆహ్వానించింది. మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కార యుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పెక్కుమార్లు చెప్పాడు. భారత దేశం మండేలాను 1990 లో ’భారతరత్న’, జవహర్‌లాల్‌ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతితో సత్కరించింది. భారత దేశం నుండి మండేలాకు ఎంతో సమర్ధన లభించింది. ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే కోట్ల మంది ప్రజలకు మండేలా ఒక ప్రతీకగా మారారు. పశ్చిమ దేశాలు కూడా హక్కుల ఉద్యమ కారులైన అబ్రహం లింకన్‌, మార్టిన్‌ లూథర్‌కింగ్‌లతో సమానంగా ఆయనను గౌరవిస్తున్నాయి. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలోకి ఆయన మలచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు తెచ్చింది.