ప్రభుత్వం మెడలు వంచిన జేఏసీ
సచ్చినట్టు మార్చ్‌కు అనుమతించిన సర్కారు
మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు అనుమతి
వేదిక మార్చేందుకు ఒప్పుకోని జేఏసీ
చీమల దండై కదలిరావాలె..
ఇంటికొకరు చేతిలో జెండా పట్టుకొని..
రుమాలు పేలికలు చుట్టుకొని..
కారం రొట్టెలతో సద్దిమూట కట్టుకొని..
నెక్లెస్ రోడ్డుపైనే కూర్చోవాలె..
తెలంగాణ వచ్చాకే లేవాలె : కోదండరాం
హైదరాబాద్ , సెప్టెంబర్ 28 (జనంసాక్షి) :
ఏమన్నరు.. ఏమన్నరు..! ప్రజాస్వామ్య ఆకాంక్ష కోసం ఉద్యమిస్తున్న వాళ్లది వేర్పాటువాదమన్నరు. సీమాంధ్ర మీడియా కూడా తెలంగాణవాదులను వేర్పాటువాదులని డిక్లేర్ చేసింది. వార్తలు రాసిందీ.. ప్రసారాలూ చేసింది. దశాబ్దాలుగా మమ్మల్ని అన్యాయంగా కలుపుకున్నరు.. మేము మీతో ఉండమని నినదించిన నాలుగున్నర కోట్ల మందిని విధ్వంసకారులని, ప్రజాస్వామ్య వ్యతిరేకులని ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ప్రతి ఆరోపణ రాజ్యం కుట్ర ఉందన్నది కాదనలేని నిజం. ఒక్క రాజ్యమే కాకుండా ఇందులో ఇంటి దొంగలు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఎంత కాలమని భరిస్తరు. ఎంత కాలమని సహిస్తరు. అందుకే తిరగబడ్డరు. తెలంగాణ బిడ్డలు సమరానికి సన్నాహాలు చేసుకున్నరు. ఇగ సచ్చుడు బంద్ అని.. తెలంగాణ హామీ ఇస్తామని నమ్మించినోళ్లను సచ్చేదాకా నిలదీస్తమని నిర్ణయించుకున్నరు. డెడ్ లైన్ విధించారు. రేపటి 30 చివరి అవకాశమని రెండు నెలల ముందే ఆల్టిమేటం ఇచ్చారు. అయినా, రాజ్యం దిగి రాలేదు. దీంతో సకల జనుల సమ్మెను, సహాయ నిరాకరణతో పాలకులకు ముచ్చెమటలు పట్టించిన తెలంగాణ పోరు బిడ్డలు, ఈ సారి కూడా సీమాంధ్ర పాలనకు వ్యతిరేకంగా, తమ ఆకాంక్షను భారత ప్రభుత్వానికి తెలిపేందుకు సిద్ధమయ్యారు. 30న తెలంగాణ మార్చ్ పేరిట ట్యాంక్ బండ్‌పై సాగరహారం నిర్వహించేందుకు పూనుకు న్నారు. అనుమతివ్వమని, వినాయక నిమజ్జనముందని, జీవవైవిధ్య సదస్సుందని, శాంతి భద్రతల సమస్య వస్తుందని, మతకల్లోలాలు చెలరేగుతాయని, మార్చ్ నక్సలైట్లు పాల్గొనే అవకాశముందని, ఇలాంటి ఎన్నో సాకులు చూపి ప్రభుత్వం తెలంగాణ మార్చ్‌ను అడ్డుకోవాలని చూసింది. కానీ, ఈ ఎత్తులేవీ తెలంగాణవాదుల ఆకాంక్ష ముందు చెల్లలేదు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ జేఏసీ ప్రభుత్వ బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గలేదు. మార్చ్‌కు తరలివచ్చేలా ప్రజలను సమాయత్తం చేసేందుకు రూపకల్పన చేసింది. అందులో నూటికి నూరు శాతం విజయం సాధించింది. చివరి వరకూ పార్టీలు కలిసిరాకున్నా ఒంటరిగా తెలంగాణ మార్చ్ ఆవశ్యకతను వివరించింది. ప్రజలు కూడా ఈ విషయాన్ని అవగతం చేసుకున్నారు. తెలంగాణ మార్చ్‌కు కదిలివస్తామని నినదించారు. దీంతో పార్టీలు దిగివచ్చాయి. అనుమతివ్వమని చివరి దాకా భీష్మించుకు కూర్చున్న, నానా సాకులు చెప్పి మార్చ్‌ను అడ్డుకోవాలని చూసిన ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చిందనడం కన్నా జేఏసీ ప్రభుత్వం మెడలు వంచిందనడం ఇక్కడ సబబుగా ఉంటుంది. ఈ అనుమతివ్వడానికి ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణవాదులను బుజ్జగించాలని చూసింది. కానీ, తెలంగాణవాదులు, జేఏసీ నాయకులు వినలేదు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సంప్రదాయంగా హైదరాబాద్ సిటీ కమిషనర్ నుంచి సీఎం కిరణ్ కుమార్, గవర్నర్ నరసింహన్ వరకు అందరినీ కలిసి మార్చ్‌కు అనుమతివ్వాలని వినతిపత్రాలు సమర్పించారు. కానీ, ఎవ్వరూ స్పష్టమైన హామీ ఇవ్వకపోగా, మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చారు. కానీ, కోదండరాం సహా జేఏసీ నేతలు ససేమిరా అన్నారు. మార్చ్‌ను వాయిదా వేయడం కుదరదని, నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వానికి వేరే దారి లేకుండా పోయింది. ప్రజాకాంక్షను తమకు పుట్టగతులు లేకుండా పోతాయని ప్రభుత్వానికి తెలిసివచ్చేలా జేఏసీ తన కార్యాచరణ రూపొందించింది. దీంతో విధి లేక, మార్చ్‌ను అడ్డుకునే దారి కానరాక ప్రభుత్వం శుక్రవారం తెలంగాణ మార్చ్‌కు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు నిర్వహించుకోవాలని సూచించింది. కానీ, ఇక్కడ కూడా ఓ మెలిక పెట్టింది. మార్చ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత జేఏసీదని లిఖిత పూర్వక హామీ తీసుకుంది. దీన్ని బట్టి ప్రభుత్వానికి పోలీసులపై ఉన్న నమ్మకం ఏపాటిదో స్పష్టమవుతుంది. ఏదేమైనా నాలుగున్నర కోట్ల మందికి తమ ఆకాంక్షను చాటడానికి అవకాశం లభించింది. వేదిక ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్డుకు మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ మార్చ్‌కు అనుమతి పొందడం జేఏసీ సాధించిన విజయమని వెల్లడించారు. తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని, దీనికి ప్రతి తెలంగాణవాది సహకరించాలని పిలుపునిచ్చారు. ఇంటికొకరు చేతిలో జెండాతో తరలిరావాలని, రుమాలు పేలికలు చుట్టుకొని, కారం రొట్టెలతో సద్దిమూట కట్టుకుని కదంతొక్కాలని, తెలంగాణ వచ్చేదాకా నెక్లెస్ రోడ్డుపైనే కూర్చోవాలని తెలంగాణవాదులను కోరారు. ఇదిలా ఉంటే, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో కాకుండా వేరే చోట మార్చ్ నిర్వహించాలని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని జేఏసీ తోసిపుచ్చింది.