ప్రభుత్వాసుపత్రులకు చికిత్స చేయాలి

నేను రానుబిడ్డో సర్కార్‌ దవాఖానకు అన్న పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో నేటికీ దానిని ఊరూవాడా పాడుకుంటున్నారు. సర్కార్‌ దవాఖానాల పరిస్థితి నేటికీ మెరుగు పడలేదనడానికి ఈ పాట సజీవంగా ఉండడమే కారణం. ప్రభుత్వాసుపత్రులకు చికిత్స చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టింపు లేదు. పోయేవి ప్రజల ప్రాణాలే గనుక ప్రభుత్వ పెద్దలకు పెద్దగా పట్టింపు లేదు. మం/-తరులు సందర్శిస్తున్నా, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా స్కార్‌ దవఖానాల తీరు మారడం లేదు. వైద్యానికి ఖర్చు చేయలేని ఎందరో అభాగ్యులు వైద్యం కోసం వచ్చి భంగపడుఉతన్నారు. వందల కోట్లు కార్పోరేట్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ చికిత్సల కోసం తగులబెడుతున్న సర్కార్‌, ప్రజల కోసం పని చేస్తున్న దవఖానాలను బాగు చేసి వాటిని కార్పోరేట్‌ స్థాయికి తీసుకుని రాలేకపోతున్నారు. ప్రభుత్వాలు మారినా పరిస్థితులు మారడం లేదనడానికి తాజాగా సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో పరిస్థితులే నిదర్శనం. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా ఇక్కడి సిబ్బంది వ్యవహారం ఉంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న సూక్తిని మరచి అమాయకుల కళ్లు పోగొట్టారు. కంటిచూపు మెరుగు పరచుకోవాలని ఈ ఆసుపత్రికి వస్తే…ఉన్న చూపు కాస్త ఊడదీశారు. హైదరాబాద్‌లోని సరోజనీదేవి ప్రభుత్వ కంటి ఆసుపత్రికి ఎంతో పేరుంది. ఒకప్పుడు ఇదే దిక్కు. కానీ ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 13 మంది రోగులు కంటిచూపు కోల్పోయే ప్రమాదమేర్పడింది. 13మందికి సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో వెద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. వెద్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించి శస్త్రచికిత్సకు ముందు కళ్లలో కాలం చెల్లిన ద్రవం వేయడంతో కంటి చూపు కోల్పోయారు. కళ్లను శుభ్రం చేసేందుకు వాడే సెలైన్‌ బాటిల్‌లో బ్యాక్టీరియా ఉన్నట్లు కళ్లు పోయాక గానీ గుర్తించ లేకపోయారు. ఎంతటి నిర్లక్ష్యమో ఇక్కడ గమనించాలి. ఆపరేషన్‌ చేసేముందు కనీస శ్రద్ద తీసుకోకపోవడం వల్ల అమాయకుల జీవితాలు అంధకారం అయ్యాయి. దీనికి ఎవరు బాధ్యులు. ఆపరేషన్‌ చేసిన డాక్టర్లా..? సెలైన్‌ బాటి చూడకుండా వాడిన సహాయకులదా.? సరఫరా చేసిన డ్రగ్స్‌ కంపెనీదా..? శస్త్ర చికిత్సకు ముందు బ్యాక్టీరియా ఉన్న ద్రవంతో కళ్లు శుభ్రం చేయడం వల్ల రోగులపై ప్రభావం పడిందని ఆసుపత్రి డిప్య్యూటీ సూపరింటెండెంట్‌ రాజేంద గుప్తా ఒప్పుకున్నారు. సెలైన్‌ బాటిళ్లు వెనక్కి పంపడానికి నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వం తరపున డ్రగ్స్‌ అధికారులు ఆసుపత్రికి వచ్చి పరిశీలించారని వెల్లడించారు. సెలైన్‌ బాటిళ్లు సరఫరా చేసిన ఏజెన్సీపై చర్యల బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రోగులకు చూపు తెప్పించేందుకు వెద్యులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడే వరకూ మరో వారంపాటు శస్త్రచికిత్సలు నిలిపివేసినట్లు రాజేందగ్రుప్తా వెల్లడించారు. అయితే ఇవన్నీ కూడా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నాయే తప్ప మరోటి కాదు. ఇలాంటి ఘటనల్లో బాధ్యతను విస్మరించిన వారిని జైలుకు పంపాలి. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా ఇదే రీతిగా వ్యవహరించింది. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ఘటనకు సంబంధించి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా నియమితులైన కంటి వైద్య నిపుణులు రవీందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. 13 మంది కంటి చూపు కోల్పోయే ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం లేదని పేర్కొన్నారు. సెలైన్‌ లో బ్యాక్టీరియా ఉండడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. 13 మందిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. బాధితులకు చూపు తెప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం లేదంటే సరిపోతుందా అన్నది గమనించాలి. కంటిచూపు మెరుగవుతుందని దవాఖానాకు వస్తే ఉన్న చూపు కూడా పోయే పరిస్థితి తలెత్తితే ఎవరు బాధ్యులు అన్నది ఆలోచనచేయాలి. ఆపరేషన్ల తరవాత కళ్ల నుంచి చీము రావడం, నొప్పిగా ఉండడంతో వైద్యులు వెంటనే మరోసారి శస్త్రచికిత్స నిర్వహించి కంటిలో పేరుకుపోయిన చీము తొలగించారు. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమించింది. వారం రోజులుగా వైద్యం అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. వీరంతా ఒక కంటిచూపు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెప్పడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చూపు బాగుచేస్తారని వస్తే గుడ్డివారిని చేశారని ఆందోళనకు దిగాయి. ఇది వైద్యుల నిర్లక్ష్యమేనని, లేకుంటే ఒక్క థియేటర్‌లో జరిగిన శస్త్రచికిత్సలు మాత్రమే ఎందుకు వికటిస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. తాజా సంఘటనకు కళ్లను శుభ్రం చేసే ద్రావణం కారణమని వైద్యులు చెబుతున్నప్పటికీ ఆపరేషన్‌ థియేటర్‌ నిర్వహణ, శస్త్రచికిత్స పరికరాల శుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2010లో కూడా ఈ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏడుగురు వృద్ధులు చూపు కోల్పోవడం జాతీయస్థాయిలో కలకలం రేపింది. జాతీయ అంధత్వ నివారణ సంస్థ విచారణ చేపట్టింది. థియేటర్‌ శుభ్రంగా లేకపోవడం, శస్త్ర చికిత్సకు వినియోగించే పరికరాలను సరిగా శుభ్రం చేయకపోవడం వల్లే ఇన్‌ఫెక్షన్లు సోకి చూపు కోల్పోయి నట్లు విచారణ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే నేటికీ ఎవరిపైనా చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. ఆనాడే స్పందించి చికిత్స చేసివుంటే ఇలా జరిగేది కాదు. ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఏవిూ లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యమంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి సెలవిచ్చారు. నిజానికి ఈ ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఓ డాక్టర్‌గా ఉండీ ఆస్పత్రుల తీరు మెరుగపడే చర్యలు తీసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. ఇంతటి బాధ్యతా రహిత మంత్రి ఉంటే ఆస్పత్రుల తీరు ఎలా బాగుపడుతందన్నది ప్రశ్న.ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేపట్టాలి. దిక్కుమాలిన పథకాలతో డబ్బు వృధా చేయకుండా దవాఖానాలకు కేటాయించాలి. వాటిని కార్పోరేట్‌ స్థాయికి తసీఉకుని రావడం ఓ లెక్క కాదు. చిత్తశుద్ది ఉంటే చేయవచ్చు. సిఎం కెసిఆర్‌ ఇందుకు పూనుకుంటే మంచిది.