ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ప్రమాణాలు
మెరుగైన ఫలితాలే ఇందుకు నిదర్శనం
కరీంనగర్,ఏప్రిల్21(జనంసాక్షి): ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రభుత్వ, ఆదర్శ, సంక్షేమ కళాశాలల్లోని విద్యార్థులు ఫలితాల్లో సత్తా చాటారు. ప్రైవేటు కళాశాలల ఉత్తీర్ణత కంటే అధికంగా ఉత్తీర్ణత శాతం నమోదు చేసి శభాష్ అనిపించుకున్నారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలను విశ్లేషిస్తే.. జిల్లాలో ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులు ఉత్తీర్ణత శాంతం పెరిగింది. సాధించారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థులు , సాంఘిక సంక్షేమ కళాశాల విద్యార్తులు ఫలితాలతో మేమెవరికీ తక్కువ కాదని నిరూపించారు. సాంఘిక సంక్షేమ, ఆదర్శ కళాశాలల్లో విద్యార్థులు అక్కడే వసతి గృహంలో ఉండి అభ్యసిస్తారు. ఈ విద్యాలయాల్లో సీటు లభించాలంటే ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరచాలి. వసతి గృహం, భోజన వసతి కల్పించడమే కాకుండా కాస్త ప్రతిభ గల విద్యార్థులు ఉండటంతో ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కంటే ముందంజలో నిలుస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకునే విద్యార్థులు అత్యధికం పదో తరగతిలో అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారే.. ఏడాదంతా వారి వెంట పడితే ఉత్తీర్ణులు అవుతున్నారు. అంతే కాకుండా అన్నీ ఉచితమని ప్రభుత్వం చెబుతున్నా రెండు సమస్యలున్నాయి. ఒకటి రవాణా సౌకర్యం, రెండవది మధ్యాహ్న భోజనం కొరవడటం. ముగిసిన విద్యా సంవత్సరంలోనే మధ్యాహ్న భోజనం వడ్డిస్తామని చెప్పినా అది అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ కళాశాలల్లోని వచ్చి వెళ్లేందుకు కొన్ని ప్రాంతాల్లో బస్సు సౌకర్యం ఇబ్బందిగా ఉండటంలో కొందరు విద్యార్థులు కళాశాలకు గైర్హాజరు కావడం ఫలితాలపై ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం విధిగా మధ్యాహ్న భోజనం వడ్డిస్తే విద్యార్థులను సాయంత్రం వేళల్లో చదివించే అవకాశం ఉంటుంది. అప్పుడు మరింత మెరుగైన ఫలితాలను చవిచూసే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు పాసు కల్పిస్తే అనుపస్థితి తగ్గుతుంది. విద్యార్థులకు ఎలాంటి భారం లేకుండా చూస్తే తప్పకుండా అద్భుతాలు సాధిస్తారని ప్రస్తుత ఫలితాలు, మార్కులు నిరూపిస్తున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలను పెంచాయి.. బయోమెట్రిక్ హాజరు విద్యార్థుల ఉపస్థితిని పెంచింది. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం.. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ.. మౌలిక వసతుల కల్పన.. ఇదంతా ఫలితాలపై ప్రభావం చూపింది. ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు తోడ్పడింది.