ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లవుతున్న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఇంటర్ పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చేరాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.ప్రతి సంవత్సరం ఇంటర్ పూర్తి చేసిన వందలాది మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చేరుతున్నారని అన్నారు.అనేక మార్లు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరిన ఏమాత్రం స్పందించడం లేదని వాపోయారు. మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకొని డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు గుండగోని అఖిల్, పట్టణ ఉపాధ్యక్షులు దరావత్ తరుణ్, మద్దెల వంశీ, బొగ్గు సతీష్ , ఈశ్వర్ , ముత్తినేని ప్రేమ్ చందు తదితరులు పాల్గొన్నారు.