ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్ కష్టాలు..సిఐటియు జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు
శ్రీకాకుళం, జూలై 29 : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు అని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు విమర్శించారు. మర్చంట్ పవర్ ప్లాంట్ విధానంతో రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లను పెట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండబోదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని కార్మిక సంఘాలతో కలిసి సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోంలో వివిధ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని గ్యాస్, బొగ్గు ఉత్పత్తి అవుతున్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు అవి తరలి పోవడంతో రాష్ట్ర అవసరాలకు వినియోగించలేని పరిస్థితి ఎదురైందన్నారు. పరిశ్రమలకు వారంలో మూడు రోజులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో యాజమాన్యాలు, కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నాయ న్నారు. ఉత్తరాంధ్రలో మర్చంట్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేసి ప్రజల జీవన విధానంపై దెబ్బ కొట్టేందుకు ప్రభుత్వం చూస్తోందని ఐఎఫ్‌టియు నాయకులు నీలంరాజు విమర్శించారు. ఎఐటియుసి నాయకులు సిహెచ్ గోవిందరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.