ప్రభుత్వ బోరు.. సొంత చేనుకు నీరు…

ప్రభుత్వ బోరు.. సొంత చేనుకు నీరు…

మాజీ సర్పంచ్, అతనికి కుమారుల చేతివాటం

– దోబీఘాట్ దగ్గర నీటితొట్టి ధ్వంసం, పశువులకు ఇబ్బందులు

– 15 ఏళ్లుగా అధికారులకు ఫిర్యాదు, పట్టించుకోని వైనం

మునిపల్లి, అక్టోబర్ 13, (జనంసాక్షి):

ప్రభుత్వ బోరు, నీటితొట్టి మాయం…
ప్రభుత్వ నిధులతో వేసిన నీటి బోరు, నీళ్ల తొట్టి(సంపు) ప్రజల అవసరాలు కోసం కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు ఓ మాజీ ప్రజాప్రతినిధి.. ఎక్కడ ప్రజలకు మేలు జరిగితే తనకు రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించ్చాడో..? కానీ నీటి తొట్టిని ధ్వంసం చేసి, బోరును తన పొలానికి మలుపుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పక్క ప్లాన్ ప్రకారమే…
దాదాపు 15 ఏళ్ళ కింద సింగూర్ ముంపునకు గురైన సమయంలో బుసారెడ్డిపల్లి గ్రామస్థులకు 1989లో పునరావాసం కల్పించారు. ఆ టైంలో ప్రజల అవసరల కోసం బట్టలు ఉతకడానికి దోభిఘాట్, పశువులకు నీళ్లు తాపడానికి తొట్టి (హౌస్)ని కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పటి సర్పంచ్ ప్రసాద్ వీరప్ప పక్క ప్లాన్ తో తన వ్యవసాయ పొలానికి దగ్గరలో బోరును, నీటి తొట్టిని నిర్మించారు. సుమారు 5 ఏళ్ళ పాటు వాటిని ఉపయోగించారు. ఆ తర్వాత తన పదవి కాలం ముగిసిపోవడంతో పశువుల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టిని కులగొట్టించారు. వీరప్ప మరణించిన అనంతరం తన ఇద్దరు కుమారులు రాచ్చన్న, వీర్ శెట్టిలు ఆ బోరును వారి పంటపొలాల సాగుకోసం పైప్ లైన్ ను సొంత చేనులోకి మల్లించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే అప్పటి నుంచి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని దోభిఘాట్ దగ్గర బట్టలు ఉతికే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి…
అయితే కాలక్రమేణ ప్రభుత్వం ప్రజలకు మౌళిక వసతులు కల్పించింది. దీనితో బుసారెడ్డిపల్లి గ్రామవాసులకు తాగు నీరు, సాగు నీరు అందుతోంది. మిషన్ భగీరథ ద్వారా ఊళ్ళోని ప్రతి ఇంటికి తాగు నీరు, అవసరాలకు కావాల్సినన్ని నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని సొంత పొలానికి బోరు ద్వారా నీటి సరఫరా నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త నీటితొట్టిని నిర్మించి పశువులకు తాగునీటి వసతి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి పశువులకు నీళ్ల సౌకర్యం కల్పిస్తారో లేదో చూడాలి..