ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి

వ్యవసాయ రుణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి
– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.పి‌ఎం‌ఈజిపితో నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకునేలా అధికారులు, బ్యాంకర్లు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన డి‌సి‌సి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.పి‌ఎం‌ఈజిపి పథకంలో ప్రభుత్వం సడలింపులు చేసిందని, కొత్త సవరణలో భాగంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50లక్షల నుండి రూ.2కోట్ల వరకు రుణ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 35శాతం, పట్టణ ప్రాంత ప్రజలకు 25శాతం సబ్సిడీ కలిగి ఉంటుందని వివరించారు. ప్రతి కుటుంబం ఆర్దికంగా బలోపేతం చేకూరేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2022 – 23 ఆర్దిక సంవత్సరంలో భాగంగా మొదటి త్రైమాసికంలో బ్యాంకర్లు లక్ష్యానికి మించి రుణాలను అందివ్వడం అభినందనీయమని అన్నారు.వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.2749.94కోట్లకు గాను రూ.944.61కోట్లు రుణాలు మంజూరు చేసి 34.55శాతం రుణాలను మంజూరు చేయడం జరిగిందని వివరించారు.అదే విదంగా విద్యా రుణాలు రూ.32.4కోట్లకు గాను రూ25.93కోట్లు, గృహ రుణాలు రూ. 180కోట్లకు గాను రూ.9.10కోట్లు,  స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 30.23కోట్లకు గాను రూ.88.3కోట్లు, ఇతర ప్రయారిటి రుణాలు రూ.64.02 కోట్లకు గాను రూ.92.84 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా రుణ లక్ష్యం రూ. 4658.41 కోట్లకు రూ. 2104కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.జిల్లాలో పి‌ఎం‌ఈజీపి పధకం కింద 15యూనిట్లకు రూ. 1.35కోట్లు శాంక్షన్ చేయగా వీటిలో ఇప్పటి వరకు 11యూనిట్లకు రూ. 0.84లక్షలు మంజూరు అయ్యాయని అన్నారు.అదే విదంగా స్టాండ్ అప్ ఇండియా పధకం కింద 28యూనిట్లకు రూ. 3.44కోట్లు అందివ్వడం జరిగిందని పేర్కొన్నారు.రుణాల రికవరీ తక్కువగా ఉందని నాన్ పేమెంట్స్ తిరిగి చెల్లించే విదంగా బ్యాంకార్లు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, ఆర్‌బి‌ఐ ఏజిఆర్ఎం రాజేంద్ర ప్రసాద్, డి‌ఆర్‌డి‌ఏ పి‌డి కిరణ్ కుమార్, నాబార్డ్ డి‌పి‌ఎం సత్యనారాయణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.