ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేయండి
మిషన్ భగీరథ పనులు డిసెంబర్ కల్లా పూర్తి కావాలి
అధికారులకు దిశానిర్దేశం చేసిన ఎంపి కవిత
నిజామాబాద్,జూన్26(జనం సాక్షి): మిషన్ భగీరథలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలకు ఇంటింటికి నీరు ఇవ్వాలన్న ప్రబుత్వ సంకల్పానికి అనుగుణంగా పనులు త్వరగా పూర్తి చేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం ఉన్నతాశయంతో చేపట్టిన ఈ పథకం సక్రమంగా పూర్తి చేయడంలో కీలక భూమిక పోషించాలన్నారు. ఇందులో భాగంగా బల్క్ వాటర్ అందచేసే పనులను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. నిజామాబాద్ ప్రగతి భవన్‌లో ఎంపీ కవిత అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై సవిూక్ష నిర్వహించిన ఎంపీ.. ఆ తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల తీరుపై అధికారులతో సవిూక్షించారు. పసుపు బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే.. ప్రస్తుతం స్పెషల్ టర్మరిక్ సెల్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఎంపీ కవిత వివరించారు. టర్మరిక్ సెల్ కార్యాలయం ఏర్పాటుకు స్థలం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఎంపీ ఆదేశించారు.
మిషన్ కాకతీయలో భాగంగా ఇప్పటి వరకు 839 చెరువులను మరమ్మతు చేస్తే లక్ష 12, వేల 900 ఎకరాల ఆయకట్టు పెరిగిందని కవిత చెప్పారు. రైతు బీమా పథకం పక్రియ తొందరగా పూర్తి చేసిన జిల్లా అధికారులను ఆమె అభినందించారు. మిషన్ భగీరథ, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పనితీరుపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీ కవిత హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
——