ప్రభుత్వ సూచనల అమలు బాధ్యత.. అధికారులదే

– క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భూ సమస్యలను పరిష్కరించండి
– కోర్టు కేసులు, వివాదాల్లో ఉన్న భూములను పక్కనపె ట్టండి
– వారసత్వ భూముల విషయంలో ఆలస్యం చేయవద్దు
– జూన్‌ 20 నాటికి ప్రతిరైతుకు పాస్‌పుస్తకాలు అందాలి
– రైతులకు అన్యాయం జరిగితే అధికారులపై చర్యలకు వెనుకాడం
– తెలంగాణలో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి
– రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్‌, మే31(జ‌నం సాక్షి) : ప్రభుత్వం చేసే సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని  వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్‌ మండలం రామన్నపేట, మోర్తాడ్‌ మండల కేంద్రంలో జరిగిన భూరికార్డుల పరిశీలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో ముఖాముఖి మాట్లాడి భూముల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కోర్టు కేసులు, వివాదాలలో ఉన్న భూములను పక్కన పెట్టాలని, ముఖ్యంగా వారసత్వ భూముల (పౌతి పట్టా) విషయంలో ఆలస్యం చేయకూడదని సూచించారు. వివాదరహిత భూములను కూడా వెంటనే నమోదు చేసి రైతులకు పాస్‌ పుస్తకాలను జారీ చేయాలన్నారు. నూతనంగా కొనుగోలు చేసిన భూములకు పాస్‌ పుస్తకాలు అందించాలని సూచించారు. జూన్‌ 20 నాటికి రికార్డుల ప్రక్షాళనను పూర్తి చేసి పాస్‌ పుస్తకాలను ప్రతి రైతుకు అందజేస్తామని మంత్రి తెలిపారు. రైతుల కష్టాలను తొలగించడానికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని, క్రింది స్థాయిలోని అధికారుల తప్పిదం, నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేదిలేదని, అధికారులపై చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు. తొలకరి వర్షాలు కురవగానే రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఎవరి దగ్గర అప్పు కోసం చేయి చాచకుండా, ప్రభుత్వమే పెట్టుబడి సమకూర్చడం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారన్నారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే పంట పెట్టుబడిగా ఎకరాకు రూ. 8000 ను రైతుబంధు పథకం ద్వారా అందిస్తుందన్నారు. రైతుబంధు పథకం సమర్ధవంతంగా అమలుకు పాస్‌ పుస్తకాలే ప్రామాణికమని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి సమగ్ర భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకున్నారని పోచారం తెలిపారు. 100 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన జరిగిందని, అయితే కొంతమంది కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో కొన్ని గ్రామాలలో భూముల నమోదులో తప్పులు దొర్లాయి. ఇప్పటికైనా అధికారులు తప్పులను సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ సూచనలను అమలు చేయల్సిన బాధ్యత అధికారులదే, సరిగ్గా పనిచేయకపోతే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడదని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఫిర్యాదుతో మోర్తాడ్‌ వీఆర్వోను తక్షణమే సస్పెండ్‌ చేయాలని మంత్రి పొచారం కలెక్టర్‌ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిషన్‌ భగీరధ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ యం. రామ్మోహన్‌ రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.