ప్రమాదస్థాయికి చేరుకున్న భూగర్బ జలాలు
-డెడ్ స్టోరేజీలోనే ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ, సాత్నాల
ఆదిలాబాద్,మే 4 (జనంసాక్షి): గత రెండు మూడెల్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, కుంటలన్నీ కూడా ఎండిపోయి బీళ్లు వారాయి. భూగర్బ జలాలు అడుగంటి పోయాయి.భూగర్బ జలాలు రికార్డు స్థాయిలో అడుగంటి పోయాయి. కనీసం త్రాగడానికే సమస్య జటిలంగా మారుతుంది. మరోవైపు అన్నదాతల వ్యవసాయం పరిస్థితి గాలిలో పెట్టిన దీపం పరిస్థితిగా మారిపోయింది. ఫిబ్రవరి నెలలో సగటున 9.98 విూటర్ల లోతుకు పడిపోగా మార్చి 15 వరకే 10.49 విూటర్ల లోతుకు ఏప్రిల్ 15 వరకు 11.90 విూటర్లలోతుకు పడిపోయాయి. ఇదికాస్తా మే 1 నాటికి మరీ దారుణంగా 13 విూటర్ల లోతుకు పడిపోవడంతో తాగునీటికి తీవ్రఎద్దడి ఏర్పడుతోంది. జిల్లాలోని 38 మండలాల్లో 22 విూటర్ల లోతుకు పడిపోయాయి నీటి మట్టం. ఆరు మండలాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఏకంగా 30విూటర్లలోతుకు చేరుకున్నాయి. తానూర్, లోకేశ్వరం, మామడ, ఆసిఫాబాద్, బజార్ హత్నూర్, నేరడిగొండ మండలాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా పడిపోయింది. గతేడాది మే 15 నాటికి 10.09 విూటర్ల లోతులోకి నీరు పడిపోగా ఈసారి మాత్రం మరీ దారుణంగా పడిపోయాయి. మంచినీటికి, సాగునీటికి, పశువులకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. జిల్లాలోభూగర్బ జలాలు అడుగంటడంతో పాటు ప్రాజెక్టులల్లో నీటి మట్టం తగ్గుతోంది ప్రాజెక్టులు డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి. జిల్లాలో ఎస్‌ఆర్‌ఎస్పీతోపాటు ఎల్లంపల్లి, కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టులనుంచి ఆయకట్టుతోపాటు తాగునీటికి నీరు అందించాల్సి ఉంది. ఈ ఏడాదిగోదావరితోపాటు దానిక ఉపనదులైన పెన్‌గంగ, ప్రాణహిత కూడా ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల్లోనికినీరు రాకుండా పోయింది. ఎస్సారెస్పీ పూర్తిసామర్థ్యం 90.31 టీఎంసీలకుగాను 5 టీఎంసీలు డెడ్ స్టోరేజి.. అయితే ప్రస్తుతం 4.80 టీఎంసీలకు చేరుకుంది. గ తేడాది ఈ సమయానికి 12టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువ ప్రాంతానికి నీరు వదలకపోయినా ఎస్సారెస్పీకి దుర్బిక్ష పరిస్థితులున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి కేవలం 2.16 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. అదీ ఎస్సారెస్పీ పైన ఉన్న వాగులు నుంచి చేరింది. బాబ్లీ గేట్లు ఎత్తినప్పుడు కొంత నీరు మాత్రమే వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 20.19 టీఎంసిలుకాగా ప్రస్తుతం 3.92 టీఎంసీలే ఉంది. ఈఏడాది 10.77 టీఎంసీల నీరు మాత్రమే ఎగువ ప్రాంతాలనుంచి వచ్చి చేరింది. వాస్తవానికి 16.26 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి పట్టణాలకు ఎల్లంపల్లి నుంచి నీరు ఇవ్వాల్సి ఉండగా పాతపద్దతిలోనే ఇంటెక్ వెల్ ద్వారా గోదావరి నుంచి నీటిని సరఫరాచేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 7.60 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.50 టీఎంసీలు మాత్రమే ఉంది. గతేడాది ఇదే సమయానికి 2.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కడెం ఆయకట్లు 60వేల ఎకరాలకుగాను రబీలో కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే నీరు అందింది. కడెంపట్టణానికి ప్రస్తుతం తాగునీరు సరఫరా అవుతోంది. ఈప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 9.41 టీఎంసీల నీరు ప్రవాహంలో వచ్చి చేరడంతో కాస్త పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఇక స్వర్ణ ప్రాజెక్టుకు సంబందించి 10వేల ఎకరాల ఆయకట్టు ఉండగా రబీలో సాగు నీరివ్వలేదు. కొద్దిపాటీ నీరున్నా కూడా ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయి. గడ్డెన్న వాగు ద్వారా బైంసా పట్టణానికి నీరు సరఫరా అవుతుండగా, మరో నెలరోజుల దాకా మాత్రమే సరిపోతుంది. ప్రస్తుతం గేట్లవద్ద మాత్రమే నీరుండగా రిజర్వాయర్ పూర్తిగా వెలవెల పోతోంది. సాత్నాల ప్రాజెక్టు ద్వారా మావలనుంచి ఆదిలాబాద్ పట్టణానికి నీరు సరఫరా
అవుతుండగా గతంలో ఎన్నడూ లేనివిదంగా నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దీంతో ఎటు చూసినా కూడా బీల్లు వారినట్లుగానే ప్రాజెక్టుల పరిస్థితి కనిపిస్తుంది, ఇంత గడ్డుకాలం గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ చూడలేని వయస్సు విూరిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీరు అందించడమే గగనంగా మారుతోంది. ఈ నెల పూర్తయి జూన్ ప్రారంభంలో విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ప్రజలు కోలుకోవడం కష్టమేనని చెపుతున్నారు.