ప్రముఖులకు పద్మ అవార్డులు

2

– రజనీ, రామోజీ, సానియా, సైనా ఎంపిక

న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులకు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో  తెలుగు తేజాలు సానియా విూర్జా, సైనా నెహ్వాల్‌, రామోజీరావు,తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తదితర ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. తెలుగువారు పలువురికి అవార్డులు దక్కాయి. మొత్తంగా తెలుగు ‘పద్మాలు’ వికసించాయి. జర్నలిజానికి సంబంధించి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ‘పద్మ విభూషణ్‌’ అవార్డు దక్కింది. ఆయనతోపాటు తెలుగు వారైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రముఖ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డికి కూడా పద్మాలు దక్కాయి. ప్రముఖ దర్శకుడు బాహుబలి రాజమౌళికి పద్మశ్రీ అవార్డు లభించింది. క్రీడా రంగంలో రాష్ట్రానికి చెందిన సానియా విూర్జా, సైనా నెహ్వల్‌ కు కూడా అవార్డులు దక్కాయి. గణతంత్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 2016 పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, పండిట్‌ రవిశంకర్‌కు పద్మవిభూషణ్‌ అవార్డు దక్కింది. సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి, డాక్టర్‌ విశ్వనాథ్‌ శాంతన్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ జగ్‌మోహన్‌, సాహిత్యరంగంలో అవినాష్‌ దీక్షిత్‌, శాస్త్రవేత్త వాసుదేవ కల్‌కుంటే ఆత్రేకు పద్మవిభూషణ్‌ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరణాంతరం ధీరూభాయ్‌ అంబానీకి పద్మవిభూషణ్‌ను ప్రకటించింది.సినీనటుడు అనుపమ్‌ఖేర్‌, ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్‌నారాయణ్‌కు పద్మభూషణ్‌ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కన్‌హేలాల్‌, బర్జీందర్‌సింగ్‌, ఎన్‌ఎస్‌ రామానుజ తాతాచార్య, బ్రిజేందర్‌సింగ్‌, రామ్‌సుతార్‌, వినోద్‌ రాయ్‌, స్వామి తేజోమయానంద, ఇందు జైన్‌, అమెరికా మాజీ రాయబారి రాబర్ట్‌ డి.బ్లాక్‌విల్‌కు పద్మభూషణ్‌ అవార్డులు దక్కాయి. అలాగే తెలుగు చిత్ర దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్‌ నటీమణి ప్రియాంక చోప్రా, నటుడు అజయ్‌దేవగణ్‌, మధుబండార్కర్‌, న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌కు పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది.  ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌ అవార్డులను అందజేయనున్నారు. ప్రముఖ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి, పండిట్‌ రవిశంకర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీలకు పద్మవిభూషణ్‌ అవార్డును ప్రదానం చేయనున్నారు.  క్రీడారంగలో విశేష కృషి చేసిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, సానియా విూర్జాలకు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల అదినేత,ఈనాడు గ్రూపు విూడియా సంస్థల అదినేత అయిన రామోజీరావుకు పద్మ విభూషణ్‌ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకం. ఈనాడు పత్రిక ద్వరా సంచలనం సృష్టించిన రామోజీరావు ఆ తర్వాత సినిమా రంగం, టూరిజం, తదితర రంగాలలో తనదైన శైలిలో అద్బుతమైన రీతిలో ప్రగతి సాధించి సమాజంలో ఒక ప్రత్యేక స్థానం పొందారు. గతంలో కూడా రామోజీరావుకు ఈ అవార్డు లకు సిఫారస్‌ జరిగినా ,కొన్ని కారణాల వల్ల రాలేదు.ఆలస్యంగా అయినా రామోజీకి పద్మ విభూషణ్‌ బిరుదు వచ్చినందుకు ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. రామోజీరావు తో పాటు ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌, న్యత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి, బాలివుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ లకు కూడా పద్మవిభూషణ్‌ లభించింది. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు.. ఇలావున్నాయి.

పద్మవిభూషణ్‌: రజనీకాంత్‌, రామోజీ రావు, జగ్‌మోహన్‌ (జమ్ము కశ్మీర్‌ మాజీ గవర్నర్‌), పండిట్‌ రవిశంకర్‌, యామిని కృష్ణమూర్తి, గిరిజా దేవి (సంగీతం), విశ్వనాథన్‌ శాంతా, ధీరూభాయ్‌ అంబానీ

(మరణాంతరం), డాక్టర్‌ వాసుదేవ్‌ ఆత్రే (సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌), అవినాశ్‌ దీక్షిత్‌

పద్మభూషణ్‌: సానియా విూర్జా, సైనా నెహ్వాల్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, అనుపమ్‌ ఖేర్‌, ఉదిత్‌ నారాయణ్‌, వినోద్‌ రాయ్‌ (మాజీ కాగ్‌), బ్రిజేందర్‌ సింగ్‌, బర్జీందర్‌ సింగ్‌, స్వామి తేజోమయనంద, రామ్‌ సుతార్‌, ప్రొఫెసర్‌ రామనుజ తాతాచార్య, హీస్నమ్‌ కన్హేలాల్‌

పద్మశ్రీ: ప్రియాంక చోప్రా, అజయ్‌ దేవగన్‌, ఉజ్వల్‌ నికమ్‌ (న్యాయవాది), అవస్థీ

మరణాంతం లాన్స్‌ నాయక్‌ మోహన్‌ నాథ్‌ గోస్వామికి

కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర అవార్డును లాన్స్‌ నాయక్‌ మోహన్‌ నాథ్‌ గోస్వామికి మరణాంతం అశోక్‌చక్ర అవార్డును ప్రకటించించారు. అత్యంత ధైర్యసాహసాలు కనబరిచిన గోస్వామి రాష్ట్రీయ రైఫిల్స్‌ బెటాలియన్‌లో పనిచేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన దాడిలో గోస్వామి టెర్రరిస్టులను సమర్థంగా ఎదుర్కొన్నారు. గాయపడ్డ తోటి సైనికులను గోస్వామి తన ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను హత్చ మార్చడంతో పాటు ముగ్గురు సైనికులను రక్షించారు. గ్యాలంటరీ కేటగిరీలో రాష్ట్రపతి మొత్తం 365 అవార్డులకు ఆమోదం తెలిపారు. ఇందులో ఒక అశోక చక్ర, నాలుగు కీర్తి చక్ర, 11 శౌర్య చక్ర, 48 సేనా మెడల్‌ ఇతర అవార్డులు ఉన్నాయి. మహేంద్ర సింగ్‌, జగదీశ్‌ చాంద్‌, రాజేశ్‌ అత్రా, గౌతమ్‌ ఘోష్‌లకు కీర్తి చక్ర అవార్డులు ప్రకటించారు.