ప్రముఖులపై ఐటీ దాడులు

– సురేశ్‌బాబు, నాని , ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
– పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు
హైదరాబాద్‌,నవంబర్‌ 20(జనంసాక్షి):టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, హీరో నాని ఇళ్లపై  ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. సురేశ్‌బాబు కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగించారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్‌ కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. పుప్పాలగూడ లోని డాలర్‌ హిల్స్‌లో ఉన్న వెంకటేశ్‌ నివాసంలో ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎంసీహెచ్‌ఆర్‌డీ సవిూపంలోని హీరో నాని కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. హీరోల ఆడిటర్లను దగ్గర ఉంచుకుని అధికారులు ఆదాయ లెక్కలను పరిశీలించినట్లు తెలిసింది. సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యయాలు వార్షిక ఆదాయాల్లో లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ సోదాలపై విూడియా హడావుడి చేయాల్సిన అవసరం లేదని, ఇవన్ని సాధారణంగా జరిగే తనిఖీలేనని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్టాల్ల్రో పలు థియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు. కాగా గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్టిబ్యూష్రన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్‌ సినిమాస్‌ పేరిట థియేటర్స్‌ను కూడా ఈ సంస్థ నిర్మించింది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు సినిమా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు తీవ్ర కలకలం రేపాయి.