ప్రముఖ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తి

1

చెన్నై అక్టోబర్‌ 11 (జనంసాక్షి): శనివారం మృతి చెందిన మనోరమకు అదివారం నాడు అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్‌ నటి మనోరమ అంత్యక్రియలు చెన్నైలోని మైలాపూర్‌ స్మశానవాటికలో ఆదివారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు మధ్య నిర్వహించారు. ఆమె అంత్యక్రియలకు పలువురు నటీనటులు, వేలాది మంది అభిమానులు హాజరై అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఓ హాస్యపు జల్లు మూగబోయింది. ఓ మాతృమూర్తి ప్రేమ దూరమైపోయింది. అందర్నీ నవ్వించే హాస్యం అంతర్థానమైంది. సినీజగత్తు నుంచి ఇక సెలవంటూ వెళ్లిపోయింది. దక్షిణాది చిత్రాల్లో అనేక పాత్రల్లో అద్భుతంగా నటించిన సినీనటి మనోరమ ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడ్డ ఆమె… చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ”ఆచి” అని అభిమానులు అల్లారుముద్దుగా పిల్చుకునే… మనోరమ మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

1937లో జననం..

1937 మే 26న తమిళనాడులోని మన్నార్‌గుడిలో జన్మించారు మనోరమ. ఆమె అసలు పేరు గోపిశాంత. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి. అనేక నాటకాల్లో వివిధ పాత్రల్లో నటించి అందరి మెప్పుపొందారు. 1950 నుంచి 70 వరకూ… ఆమె హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేశారు. ఆ తర్వాత ప్రధాన పాత్రల్లో నటిస్తూ… మంచి గుర్తింపు పొందారు. 1958లో ”మాలై ఇట్ట మంగై” అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ… సుమారు 1,500 సినిమాలకు పైగా నటించి గిన్నిస్‌ రికార్డులో స్థానం సాధించారు.

తెలుగు చిత్రాల్లో నటన..

ఎన్నో మరపురాని పాత్రల్లో నటించారు మనోరమ. తెలుగులో రిక్షావోడు, మనసున్న మారాజు, బావ నచ్చాడు, కృష్ణార్జున, అరుంధతి, ప్రేమికుడు, 7/ఉ బృందావన్‌ కాలనీ సినిమాల్లో నటించారు. అంతేకాకుండా మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. తన కెరీర్‌లో ఐదుగురు ముఖ్యమంత్రులతో నటించిన ఘటన ఆమెది. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత, ఎన్టీఆర్‌ సరసన నటించారు. ఇక అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. 1989లో జాతీయ ఉత్తమ సహాయనటి పురస్కారాన్ని అందుకున్నారు. 1995లో ఫిలిం ఫేర్‌ లైఫ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు సాధించారు. 2002లో పద్మశ్రీ లభించింది. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన మనోరమ ఎప్పటికీ చిరస్మరణీయురాలే. ఆమెను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.