ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇకలేరు

నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి):
హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రేపు ఉదయం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సీనియర్‌ నటుడి మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి. 1940, జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విజయనరగ సామ్రాజ్య క్షత్రియుల వంశస్థుల కుటుంబంలోకృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.1966లో ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీరంగ ప్రవేశంచేశారు. హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ ప్రతినాయకుడిగా కూడా అలరించారు. కృష్ణ హీరోగా రూపొందిన ‘అవేకళ్లు’ చిత్రంలో విలన్‌గా నిరూపించుకున్నారు. తన విలక్షణమైన నటనతో కొంతకాలంపాటు టాలీవుడ్‌ ఏలిన రెబల్‌ స్టార్‌ 183కుపైగా చిత్రాల్లో నటించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుతీసుకొచ్చాయి. నిర్మాతగా గోపీకృష్ణ బ్యానర్‌లో పలు చిత్రాలు రూపొందించారు. చివరిసారిగా ఆయన ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమాలో వెండితెరపై కనిపించారు.
ఉత్తమమైన నటనకు గాను 1977, 1984లో ఆయన నంది అవార్డులు గెలుపొందారు. 1986లో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు లభించింది. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు.
రాజకీయ జీవితం..
సినిమాల్లో నటిస్తూనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్‌ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1998 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో మరోసారి నర్సాపురం నుంచి పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదేస్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

తాజావార్తలు