ప్రముఖ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి కన్నుమూత


– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
– నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
ముంబయి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ప్రముఖ శాస్త్రీయ హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణా దేవి శనివారం ఉదయం కన్నుమూశారు. 92ఏళ్ల వయసులో అనారోగ్యంతో ముంబయిలోని బ్రీచ్‌ కెనడీ ఆస్పత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా ఆమె పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నపూర్ణా దేవి ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత అయిన అన్నపూర్ణా దేవిని ఎంతో మంది ‘మా’ అని సంబోధిస్తారు. ఆ పేరుతోనే ఆమె అందరికీ సుపరిచితం.
మధ్యప్రదేశ్‌లోని మైహర్‌ పట్టణంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్‌ ‘బాబా’ అల్లావుద్దీన్‌ ఖాన్‌, మదీనా బేగం దంపతులకు 1927లో జన్మించారు. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రోషనారా ఖాన్‌. ఆమె తండ్రి అప్పటి మహారాజు బ్రిజ్‌నాథ్‌ సింగ్‌ దగ్గర సంగీత విద్వాంసులుగా ఉండేవారు. మహారాజు బ్రిజ్‌నాథ్‌ ఆమెకు అన్నపూర్ణాదేవిగా నామకరణం చేశారు. దీంతో ఆమె ఈ పేరుతోనే ప్రసిద్ధి చెందారు. ఐదేళ్ల వయసు నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. సితార్‌, సుర్బాహర్‌ వాద్యాల్లో చాలా ప్రావీణ్యురాలు. ఆమె తన 14ఏళ్ల వయసులో ప్రముఖ సితార్‌ విద్వాంసులైన పండిట్‌ రవి శంకర్‌ను వివాహం చేసుకున్నారు. 20ఏళ్ల తర్వాత వారు విడిపోయారు. ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్‌ అలీ అక్బర్‌ ఖాన్‌ అన్నపూర్ణా దేవికి సోదరుడు. అన్నపూర్ణా దేవి కుమారుడు శుభేంద్ర శంకర్‌(శుభో) కూడా సంగీత ప్రదర్శనలతో మంచి పేరు సంపాదించారు. కానీ ఆయన చిన్న వయసులో 1992లోనే చనిపోయారు. ఎందరో ప్రముఖులు సితార్‌, సరోద్‌ సంగీత వాయిద్యాలను అన్నపూర్ణాదేవి దగ్గర నేర్చుకున్నారు. ఆమె శిష్యుల్లో ఆశిష్‌ ఖాన్‌, అమిత్‌ భట్టాచార్య, బహదూర్‌ ఖాన్‌, బసంత్‌ కబ్రా, హరిప్రసాద్‌ చౌరాసియా, సురేశ్‌ వ్యాస్‌ తదితరులు ఉన్నారు. అన్నపూర్ణ మృతి పట్ల పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.