ప్రవాస భారతీయులు తెలంగాణ రాయబారులుగా మారండి

1

– కేటీఆర్‌

హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి): ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రానికి గుడ్‌విల్‌ రాయబారులుగా మారాలని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా మూడోరోజైన శనివారం పిట్స్‌బర్గ్‌లో కార్నేగి మెలన్‌ వర్శిటీ, టెక్‌షాప్‌, ఆల్ఫా ల్యాబ్స్‌ గేర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన కార్నెల్‌ మెలాన్‌ వర్సిటీ అధ్యక్షుడు సుబ్రా సురేష్‌తో భేటీ అయ్యారు. పిట్స్‌బర్గ్‌లోని ఆల్ఫా ల్యాబ్‌ అనే ఇంక్యూబేటర్‌ను సందర్శించారు. ఈ ఇంక్యూబేటర్‌ అనుభవాన్ని తెలంగాణ హబ్‌కు ఉపయోగించుకుంటామని తెలిపారు. పిట్స్‌బర్గ్‌లోని టెక్‌షాను మంత్రి సందర్శించారు. పిట్స్‌బర్గ్‌లోని ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచమంతా భారత దేశం వైపు చూస్తోందని తెలిపారు. ప్రపంచమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఇందు కోసం విదేశాల్లో ఉన్న ఎన్నారైలంతా తమతో కలిసి రావాలని కోరారు. ప్రతీ తెలంగాణ ఎన్నారై ఒక్కో గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా మారాలని అన్నారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను మిగులు రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ఇందుకోసం సరియైన ప్రణాళికలు రూపొందిస్తూ ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తోన్నామని వెల్లడించారు.