ప్రశాంతంగా పరీక్షలు నిర్వహణ

విజయవాడ, జూలై 29: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నగరంలో నిర్వహించిన పరీక్షలను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లనడుమ ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆర్‌డిఓ ఎస్‌.వెంకట్రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నగరంలోని పలు కేంద్రాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షలను వెంకట్రావు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటికల్‌ సబ్‌ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయటం జరిగిందన్నారు. 6.600 మంది అభ్యర్థులు ఉద్యోగాల నియామకం కొరకు దరఖాస్తు చేసుకోవటం జరిగిందన్నారు. అభ్యర్థులకు నేడు నగరంలో పోటీ పరీక్షలు నిర్వహించాలని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వారి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు నగరంలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నలుగురు తహశీలాల్దర్లను లైజనింగ్‌ అధికారులుగా నియమించామని, ఒక్కొక్క పరీక్షా కేంద్రానికి ఒక సహాయ లైజనింగ్‌ అధికారిని నియమించి పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం జరిగిందన్నారు. విజయవాడ అర్బన్‌, రూరల్‌, పెనమలూరు, తోట్లవల్లూరు తహశీల్దార్లు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు.