ప్రశాంతంగా పోలింగ్
– ఓటేసిన ప్రముఖులు
హైదరాబాద్,ఫిబ్రవరి 2(జనంసాక్షి):బల్దియా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే మందకొడిగానే సాగుతోంది. ఓటేయడానికి ఎవరు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన దాఖలాలు కనిపించలేదు. పెద్ద ఎత్తున ప్రచారాం నిర్వహించినా ఓటర్లు తరలివచ్చిన దృశ్యాలు లేవు. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమైనా ఎక్కడా పెద్దగా క్యూకట్టిన దాఖలాలు లేవు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేంచాలనుకున్న అధికారులు ఆ మేరకు సాధ్యమైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయడమేకాక, కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఈసీ చేపట్టిన ఈ చర్యలపై ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. నగరంలోని పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు ఓటేయడానికి ఆసక్తి చూపారు. సినీరంగానికి చెందిన వారు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఖైరతాబాద్‌లోని 17వ పోలింగ్ కేంద్రంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటు హక్కు వినియోగంచుకున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంమైన కొద్ది సేపటికే జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిలు కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఓటర్లందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఓటేసిన మరికొందరు ప్రముఖుల వివరాలిలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు అల్లు అర్జున్, అజాంపురాలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మారేడుపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, చిక్కడపల్లిలో భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్ , రాష్ట్రమంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ హిమాయత్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, టిడిపి యువనేత నారా లోకేశ్ దంపతులు, భువనేశ్వరి, సినీనటులు బాలకృష్ణ, అల్లు అర్జున్, నాగార్జున, అమల తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. కొందరు సెల్ఫీలు దిగి సోషల్‌విూడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్‌నగర్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు కూడా ఓటేశారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో సినీనటుడు అక్కినేని నాగార్జున, అమల దంపతులు ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఈ సందర్భంగా నాగార్జున విూడియాతో మాట్లాడుతూ..ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారా మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని సూచించారు. అఖిల్‌కు ఓటు లేదని విూడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరంలో ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద నాగార్జునతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు రాజేందప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేపీహెచ్‌బీ ఏడవ ఫేజ్‌లో రాజేందప్రసాద్ ఓటేశారు. అనంతరం రాజేందప్రసాద్ విూడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ యువత ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. యువత ప్రతి ఒక్కరూ వచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఇక జూబ్లీహిల్స్‌లో నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖులందరిలోకీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముందుగా ఓటు వేశారు. ఉదయం 7:15కే రాంగనర్ లోని జేవీ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో దత్తన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్.. నందినగర్ (బంజారాహిల్స్)లో ఏర్పాటుచేసిన పోలింగ్ తో ఓటు వేశారు. హైదరాబాద్ ఉజ్వల భవిష్యత్ కోసం నగర వాసులంతా ఓటు వేయాల్సిందిగా యువనేత పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కాచిగూడలో ఓటు వేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కుందన్ బాగ్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. రాజేంద్ర నగర్ డివిజన్ లోని బాబుల్ రెడ్డి నగర్ లో ఓటేశారు. ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి రిసాలాగూడలో ఓటువేశారు. ఈ సందర్భంగా యువనేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సిరా గుర్తును చూపిస్తూ.. సెల్ఫీని సోషల్ విూడియాలో పోస్టు చేశారు. ‘మేం ఓటు వేశాం.. విూరూ వేశారా.. లేదంటే ఇప్పుడే వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోండి’ అభిమానులను కోరారు.
డిజిపి పర్యవేక్షణ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. పోలీసుశాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఉదయం 10గంటలకు 11.25శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అత్యాధునికమైన ఇంటిగ్రేటేడ్ ఈ-సర్వేలేన్స్ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని, బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు కమెండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 811 సమస్యాత్మక, 286 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. పోలింగ్ పక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షించారు.
ఎప్పటిలాగే మొరాయించిన ఇవిఎంలు
మైలార్‌దేవరపల్లి డివిజన్‌లోని లక్ష్మీగూడ, కొండాపూర్ డివిజన్‌లోని 33,35,38 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. బల్దియా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 12గంటల వరకు కేవలం 20శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. హబ్సిగూడ గిరిజనబస్తీ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా అభ్యర్థికి పోలీసులు సహకరిస్తున్నారని తెరాస నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉప్పల్ తెరాస ఇన్‌ఛార్జి సుభాష్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదాని దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇకపోతే పార్టీ టోపీలు, కరపత్రాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన సోమాజిగూడ కాంగ్రెస్ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సెలవు ప్రకటించలేదని కార్మికులు ఉప్పల్ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. నేరేడ్‌మెట్‌లో డబ్బులు పంపిణీ చేస్తున్న తెరాస కార్యకర్తను స్థానికులు సట్టుకుని పోలీసులకు అప్పగించారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని రోషన్‌దౌలా బస్తీవాసులు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బహిష్కరించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఓటు వేసేది లేదన్నారు. సుమారు 500 మంది స్థానికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి రోషన్‌దౌలాలో స్మశానవాటిక సమస్య ఉందని దాన్ని వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలానికి పోలీసులు భారీగా మోహరించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి మంగళవారం ఎన్ బీటీ నగర్ లో ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటరు కార్డులున్నా అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. మాసబ్ ట్యాంక్ లోని 36, 37 పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తార్నాకా డివిజన్ మాణికేశ్వర్ నగర్ లోనూ ఓటర్లు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయనీయడం లేదని తెలిపారు.
ఓటేయడం బాధ్యత కావాలి: జూనియర్ ఎన్టీఆర్
ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరునిగా మన బాధ్యతని నటుడుజూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన తన భార్య లక్ష్మీ ప్రణతి తల్లితో కలసి వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. సరైన నాయకున్ని ఎన్నుకోవాలని జీహెచ్ ఎంసీ ఓటర్లకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తనకు ఒంట్లో నలతగా ఉన్నా వచ్చి ఓటేశానని వెల్లడించారు. అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇకపోతే గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచండి..ప్రతొక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నా సంపన్నులు నివాసం ఉండే జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మంగళవారం గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సెలబ్రెటీలు కొంతమందే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధిక శాతం ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజీ లైఫ్ కారణంగా వీరు సాయంత్రం వరకు వీరు ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాతబస్తీలో కానరాని ఉత్సాహం
గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. పాతబస్తీలో మాత్రం 12గంటవరకు కూడా తక్కువగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాతబస్తీలో తొలిగా ఓటేయడానికి నిరాసక్తతను చూపారు. పోలింగ్ ప్రారంభమై సుమారు ఐదుగంటలైనా పది శాతం కూడా దాటలేదు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతోంది. సౌత్ జోన్ డీసీపీ పోలింగ్ పరిస్థితిని సవిూక్షించారు. ఎప్పటిలాగే పాతబస్తీలో పోలింగ్ ఆలస్యంగా మొదలవుతుందని, మధ్యాహ్నం సమయంలో క్యూలు కట్టే అవకాశం ఉందని పోలింగ్ అధికారులు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ తో పోలిస్తే 60-80 శాతం పోలింగ్ అయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలో లలితాబాగ్ లో మొత్తం 2600 ఓట్లు ఉండగా తొలిగా 290 మాత్రమే ఓట్లు పోలయ్యాయి. మెహిదీపట్నంలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. 66వ డివిజన్ లో సీపీఎం గుర్తుకు బదులు సీపీఐ గుర్తు కేటాయించడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని సీపీఎం అభ్యర్థి అధికారులకు సూచించడంతో సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం 12గంటల వరకు 20 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ 3300 బూత్ లు ఏర్పాటు చేశారు. మొత్తం 20 లక్షల మంది ఓటర్లు తమ ఓటును హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ శాతం అధికమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాప్రా ఏరియా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకొడిగా సాగింది. 8గంటల తరువాత ఓటర్లు మెల్లిగా కేంద్రాలకు రావడం మొదలు పెట్టారు. పది గంటల వరకు 18శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. గతంలో నమోదైన 57 శాతాన్ని ఈ ఎన్నికలు అధిగమిస్తాయని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. మల్లాపూర్ లో 49 బూత్ లు ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ 47వేల ఓట్లు ఉన్నాయి. మల్లాపూర్ కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదులు రావడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్పటికప్పుడు సౌకర్యాలు కల్పించారు.
సైబరాబాద్ పరిధిలో ప్రశాంతం: సివి ఆనంద్
సైబరాబాద్ పరిధిలోని 64 వార్డుల్లో జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొసాగిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలుజరగలేదన్నారు. సైబరాబాద్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 20శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పరిధిలో 16వేల మంది పోలీసులతో బందోబస్త్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఓటు హక్కు చాలా విలువైందని..దాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. చాలామంది ఓటుకు దూరంగా ఉండడంపై ఆయన ఆవేదన చెందారు. ప్రాచరంనిర్వహించినా ఎవరు కూడా ముందుకు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.