ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నారు
గాంధీచౌక్ (ఖమ్మం): పెంచిన విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం నగరంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీతోపాటు ఇతర వామపక్షాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. పెవిలియన్ మైదానం నుంచి బస్టాండ్ వరకు పార్టీలు ప్రదర్శన నిర్వహించాయి. అనంతరం మయూరి సెంటర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడినుంచి ద్విచక్ర వాహనాలతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఖమ్మం ఆర్టీసీ బస్సు డిపో నుంచి బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాగల హేమంతరావు, సీపీఎం డివిజనల్ కార్యదర్శి ఎర్రా శ్రీకాంత్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ కార్యదర్శి పోటు రంగారావు తదితరులు పాల్గొన్నారు.