ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం – సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్,ఆగస్టు30 : గణెళిష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 24 వేల మంది పోలీసులు, వేలాది సీసీ కెమెరాల ద్వారా అణువణువు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. బక్రీద్, వినాయక నిమజ్జనం ఒకేసారి వస్తున్న సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు, జీహెచ్‌ఎంసీ
అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తమ శాఖల అధికారులతో కలిసి బుధవారం రూట్ మ్యాప్ ను పరిశీలించారు. చాంద్రాయణగుట్ట, పాతబస్తీల్లో పర్యటించి ఏర్పాట్లను సవిూక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు పండగలు ఒకేసారి వస్తున్నందున ప్రజలంతా సహకరించాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండుగలు జరుపుకోవడానికి అన్ని శాఖల సలహాలు తీసుకుంటామని ఆయన వివరించారు. రూట్ మ్యాప్ పరిశీలనలో భాగంగా సీపీ మహేందర్ రెడ్డి బాలాపూర్ గణెళిశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక వినాయక ఉత్సవ కమిటీలు, అన్ని శాఖల సహకారంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి చెప్పారు. నిమజ్జనం రోజున జరిగే కార్యక్రమాలకు ఇప్పటికే అన్ని వసతులు కల్పించామని తెలిపారు. చెత్త వేయడానికి అక్కడక్కడ లక్ష కవర్లను ఉంచామని, 168 మంది యాక్షన్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. 5300 మంది జీహెచ్‌ఎంసీ కార్మికులు, 203 వాహనాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.