ప్రాజెక్టులపై ప్రాణాళికలు సిద్ధం చేసుకోండి

C

– గ్రామపంచాయతీలకు మరిన్ని అధికారాలు

-సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు రైతులు ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను కలిశారు. అక్కడి నుంచి తెచ్చిన గోదావరి జలాలను కేసీఆర్‌కు అందజేశారు. మహారాష్ట్రతో గోదావరి జల ఒప్పందంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లను ఈ వేసవిలోనే నిర్మిస్తామని కేసీఆర్‌ రైతులకు హావిూ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాలతో జల జగడానికి తెరపడటం ఆనందంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్ణాటక 400 బ్యారేజీలు నిర్మించాయని… ఎగువ ప్రాజెక్టులన్నీ నిండితే తప్ప కిందకి నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. తుమ్మిడిహట్టి, కాళేశ్వరం వద్ద నిర్మించే ప్రాజెక్టులే తెలంగాణకు శరణ్యమన్నారు. గోదావరిపై ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టడం సరికాదని కేసీఆర్‌ అన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే వారికి మనుగడ ఉండదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్నారు.

పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయాలి

హైదరాబాద్‌: గ్రామాల సమగ్రాభివృద్ధికి పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సవిూక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలను బదలాయించాలని సూచించారు. పంచాయతీల్లో ప్రజలకు అందాల్సిన సేవలు వెంటనే అందేలా మార్గదర్శకాలు ఉండాలన్నారు. పంచాయతీల పటిష్టతకు అవసరమైతే ఈ సమావేశాల్లోనే చట్టం తెచ్చేలా చర్యలు తీసుకుంటామని… దీనిపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. చెత్త సేకరణకు పంచాయతీలకు 25వేల రిక్షాలను త్వరలోనే అందజేయాలని ఆదేశించారు.