ప్రాజెక్టులు అడ్డుకుంటే తిరుగుబాటు
– మాజీ మంత్రి డీకె అరుణ
హైదరాబాద్ జూలై 13 (జనంసాక్షి):
పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ హెచ్చరించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి రాసినట్లు చెబుతున్న లేఖను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు లేఖను సాకుగా చూపుతూ ప్రాజెక్టును ఆపేయాలన్న దురాలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు అనుమానం కలుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది కాలంలో తెరాస ప్రభుత్వం ఎలాంటి పురోగతి సాధించలేకపోయిందని విమర్శించారు. తక్షణమే వెయ్యి కోట్లు కేటాయించి పాలమూరు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకపోవడం దారుణమని అన్నారు.