ప్రాజెక్టులు కట్టింది మేము.. ప్రారంభిస్తున్నది కాంగ్రెస్‌

` ‘సీతారామ’ ఘనత బీఆర్‌ఎస్‌దే
` 8 నెలల్లో ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసిందా?
` హరీశ్‌రావు
హైదరాబాద్‌(జనంసాక్షి): సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాజెక్టు అని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఖమ్మం జిల్లాకు కరవు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు కోసం సంకల్పం చేసింది కేసీఆర్‌ అని అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని నిర్మించాలనుకున్నారని చెప్పారు.’’8 నెలల్లో సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేసిందా? కాంగ్రెస్‌ నేతలు పరాన్న జీవులుగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీపడి పర్యటనలు చేస్తున్నారు. మేము ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకొంటున్నారు. మేము చేసిన ప్రతి మంచి పని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందని చెప్పుకొంటున్నారు. కేసీఆర్‌ కాకుండా సీతారామ ప్రాజెక్టును వేరేవారు రూపకల్పన చేసి ఉంటే అంత బాగా ఉండేదా? కాంగ్రెస్‌ పాలనలో ఖమ్మం జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదు. కానీ, కేసీఆర్‌ ఈ జిల్లాలో రెండు పంటలు పండే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేశారు. 8 ప్యాకేజీల్లో 5 భారాస ప్రభుత్వం చేసిందే. మరో 3 ప్యాకేజీల్లో 80 శాతం పనులు మేమే పూర్తి చేశాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.