ప్రాజెక్టులు పూర్తయితేనే సాగునీటి సమస్యకు చెక్
కాళేశ్వరం తదితర ప్రాజెక్టులపై అందుకే ఒత్తిడి
శరవేగంగా ప్రాజెక్టుల పూర్తికి చర్యలు
హైదరాబాద్,మే14(జనంసాక్షి): ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి వనరులు అందుబాటులోకి రానున్నాయి. మూడు పంటలు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. వచ్చే వర్షాకాలంనుంచే వీలైనంత ఎక్కువగా గోదావరి జలాలను తీసుకునేందుకు కావాల్సిన అన్ని పనులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని సిఎం సూచించారు. ఇందుకోసం వాయువేగంతో పనులు జరుగాలని దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన వల్ల మరింత అవగాహన పెరిగిందన్న ముఖ్యమంత్రి.. కాళేశ్వరం ఎత్తిపోతల పనులను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పట్టుదలతో పనిచేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపుహౌస్‌లు అన్ని పూర్తికాగానే వచ్చే జూన్ నుంచి గోదావరి బేసిన్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న చెరువులు, కుంటలను యుద్ధ ప్రాతిపదికన నింపడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగులకుండా మొత్తం వ్యవసాయ యోగ్య భూమికి సాగునీటి వసతికల్పించే లక్ష్యంతో ప్రాజెక్టులకు రూపకల్పనచేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటన దార్శనికతను ప్రతిబింబిస్తోంది. గతంలో లాగా జలయజ్ఞంతో డబ్బులు దండుకున్న కార్యక్రమం జరగడం లేదు. అనుకున్న ప్రాజెక్టులను అనుకున్నట్లుగా పూర్తి చేస్తున్న తీరు తెలంగాణ సంకల్పానికి నిదర్శనంగా నిలవనున్నాయి. ఎక్కడా సాగునీరు అందని భూములను లేకుండా గోదావరి బేసిన్‌లోని నదులు, కాల్వలపై చెక్‌డ్యాంల ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని అదేశించారు. మానేరు రివర్‌లో నాలుగు నుంచి ఐదు, మూలవాగు రివర్‌లో రెండు నుండి మూడు వరకు, ఇంకా అవసరం ఉన్న చోట చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రణాళిక తయారుచేయాలన్నారు. ముందుగా దీనికి అవసరమయ్యే సర్వే చేయాలని అధికారులను అదేశించారు. దేవాదుల నుంచి వరంగల్ జిల్లా మొదలుకొని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు సాగునీటిని అందించాలన్నారు. వ్యవసాయం తరువాత అతిపెద్ద వ్యాపారంగా చేపల పెంపకం నిలుస్తుందని సీఎం అన్నారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో గోదావరిపై నిర్మిస్తున్న మేడిగడ్డ,
అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతోపాటు పంప్‌హౌజ్ పనులను సీఎం పరిశీలించారు. ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఆరో ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గాలను, పంప్‌హౌజ్‌లను, సర్జ్ పూల్స్, సబ్‌స్టేషన్లను పరిశీలించారు. తదుపరి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద 8వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద శ్రీరాంసాగర్ పునర్జీవ పథకంకింద సాగుతున్న పంపుహౌస్ పనులను పరిశీలించారు. రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టును విహంగ వీక్షణం చేశారు. వచ్చే వానకాలం నుంచే వీలైనంత ఎక్కువగా గోదావరి జలాలను తీసుకునేలా అన్ని పనులు సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌజ్ నుంచి నీటిని అన్నారం, సుందిళ్ల,
ఎల్లంపల్లి నుంచి మేడారం వరకు మొత్తం 105విూటర్ల ఎత్తుకు నీటిని తరలించడమే కీలక ఘట్టమని సీఎం అన్నారు. వచ్చే ఎండాకాలం లోగా పనులను పూర్తి చేసి నీటిని ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానకాలంనుంచి గోదావరి నుంచి సాధ్యమైనంత నీటిని తీసుకోవాలని చెప్పారు. ఇందుకు కావాల్సిన అన్ని పనులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకొని ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరదకాల్వ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎత్తిపోయాలని, మరో టీఎంసీ నీటిని మిడ్‌మానేరుకు తరలించడానికి కావాల్సిన పనులు పూర్తిచేయాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏమైనా భూసేకరణ సమస్యలు, ఇతర సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగారు. ఎటువంటి సమస్యలు
లేవని అధికారులు బదులిచ్చారు. తుపాకులగూడెం నుంచి లక్ష్మీపూర్‌వరకు నిర్మాణం జరుగుతున్న పనులు, పంపుహౌస్‌లు, బరాజ్‌ల పనులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగులకుండా మొత్తం వ్యవసాయయోగ్య భూమికి సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని తెలిపారు. రోహిణి కార్తెలోనే నాట్లు పడేలా ఉండాలని, మార్చి లోపే యాసంగి పంటల పక్రియ పూర్తి ఆయ్యే విధంగా రైతులకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రైతులు ఇక భవిష్యత్‌లో వర్షానికి ఎదురుచూసే పరిస్థితి లేకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును, అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తంగా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చూసే రోజులు దగ్గరపడ్డాయి. అందుకు తెలంగాణ ఆదర్శంగా ఉంటుందనడంలో సందేహం లేదు.