ప్రాజెక్టుల డిజైన్ మార్పుపై ప్రజలకు వివరిద్దాం
– సీఎం కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్,జనవరి17(జనంసాక్షి):: తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్ ఎందుకు చేపట్టారో త్వరలో ప్రజలకు చెప్పేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం సమగ్ర నివేదిక తయారు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గోదావరిలో మన వాటా ప్రకారం నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వాడుకోవడానికే ప్రాజెక్టుల రీడిజైనింగ్. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలి. ఇందుకోసం అధికారులు పూర్తి నివేదిక తయారు చేయాలి. గోదావరి, కృష్ణా నదులపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవాలి. ఇప్పటికే పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులు కూడా వెంటనే పూర్తి చేయాలి. అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఏకకాలంలో జరగాలి. సమైక్య పాలనలో తెలంగాణ ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు ముందుకు పోవద్దనే తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్లకు డిజైన్ చేశారు. అప్పుడు తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలన్నది వ్యాప్కోస్ ప్రతిపాదన కాదు. అప్పటి ప్రభుత్వ ఒత్తిడి మాత్రమే.గోదావరి ప్రధాన నదిపై కాకుండా ఉపనది ప్రాణహితపై ప్రాజెక్టు కట్టాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలి. మేడిగడ్డ వద్ద నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. ఆ రాష్ట్ర సీఎంతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఉద్యమ సమయంలో కాళేశ్వరంలోని దేవాలయంలో మొక్కులు మొక్కాను. మొక్కులు చెల్లించి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తాం. గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నిర్మించే బ్యారేజీలకు వెంటనే టెండర్లు పిలవాలి. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కానీ ఆ ప్రాజెక్టును ప్రయోజనాత్మకంగా మార్చడమే లక్ష్యం. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహితపై బ్యారేజ్ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల పది వేల ఎకరాలకు సాగునీరందిస్తాం. అందుకు సంబంధించిన బ్యారేజ్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం వ్యాప్కోస్‌తో సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ల పనులను రెండేళ్లలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలి. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో చేపట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరా సాగర్ ఏకీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ఖరారు చేశాం. ఇందుకు వెంటనే టెండర్లు పిలవాలి. దుమ్ముగూడెం నుంచి నీటిని తోడాలి. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ రెండింటిని కలపాలి. రోళ్లపాడు, బయ్యారం రిజర్వాయర్ల ద్వారా జిల్లాలో కొత్తగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. ఆ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.