ప్రాణం తీసిన ఈత సరదా
వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోరం
– ఈతకెళ్లి పదిమంది మృతి
మహబూబ్‌నగర్ ,ఏప్రిల్29(జనంసాక్షి): వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఈత సరదా పది మంది ప్రాణాలు తీసింది.మహబూబ్‌నగర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఏడుగురు మృతిచెందారు. ఆమనగల్లు మండలం చారికొండ గౌరమ్మ చెరువులో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు మహిళల మృతదేహాలను వెలికితీశారు. వీరంతా హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ రోడ్‌లో ఉన్న సుచిత్ర ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. వీరికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటన ఇక్కడ తీవ్ర సంచలనం కలిగించింది. ఇదిలావుంటే గద్వాల నియోజకవర్గం గట్టు మండలం మెట్టదొడ్డి గ్రామ శివారులోని ఓ పండ్ల తోటలో గుర్తుతెలియని వివాహిత(40) చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఉదంతంపై స్థానికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మహిళను హత్య చేసి ఆపై ఉరిగా చిత్రీకరించి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
వరంగల్ జిల్లాలో బావిలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని దాసరివాడకు చెందిన ముగ్గురు చిన్నారులు బుధవారం బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు. దాసరివాడకు చెందిన రాగవ అనిత(14), రాగవ చెందు(13), తొర్రురు పట్టణానికి చెందిన నరిగెడ్డ చెందు(12) బుధవారం మధ్యాహ్నాం బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లారు. అక్కడ వీలుకాకపోవడంతో చెరువు సమీపంలో ఉన్న బావిలోకి దిగారు. ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతిచెందారు. కూలీ పనులకు వెళ్లివచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. బావి సమీపంలో చెప్పులు చూసి వెదుకగా బావిలో ముగ్గురు శవాలై కనిపించారు.