ప్రాణం తీసిన రియాల్టీ షో..

1హైదరాబాద్ : తాను హీరో అనిపించుకోవాలని అనుకున్నాడో ఓ యువకుడు…రియాల్టీ షోలో ఎలా చేస్తారో అలాగే తన స్నేహితుల ఎదుట చేసి భేష్ అనిపించుకోవాలని అనుకున్నాడు..కానీ చివరకు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. గతంలో కిక్ బాక్సింగ్ కారణంతో ఒకరి ప్రాణం పోయిన సంగతి తెలిసిందే. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించుకోవాలని..దీని నుండి సురక్షితంగా బయట పడాలని 17 ఏళ్ల జలీలుద్దీన్ నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే ఈ నెల ఏడో తేదీన స్నేహితుల ఎదుట ఈ సాహస చర్యకు ఉపక్రమించాడు. అనుకోని విధంగా శరీరాన్ని మంటలు చుట్టుముట్టేశాయి. 80 శాతం శరీరం కాలిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. జలీలుద్దీన్ మృతి చెందడంతో వారి నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.