ప్రాణహిత-చేవెళ్ల పై ఆ పత్రికలవి అసత్య కథనాలు..

1
ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు

హైదరాబాద్‌,మే18(జనంసాక్షి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు విద్యాసాగర్‌ రావు మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై పూర్తిగా అలసత్వంతో వ్యవహరించాయన్నారు. 2012లోపు పూర్తి చేస్తామని నాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటించినా ఇప్పటి వరకు పూర్తి కాలేదని గుర్తుచేశారు. వచ్చే రెండు మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని విద్యాసాగర్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. విూడియా సంస్థలు తోచినట్టు ప్రాజెక్టుపై కథనాలు ప్రసారం చేయకుండా ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.

గోదావరి నికర జలాలతో 16 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని విద్యాసాగర్‌ రావు వెల్లడించారు. గోదావరి నుంచి 160 టీఎంసీల నీళ్లు వాడుకునేందుకు అనుమతి వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వాలు కేంద్ర జల సంఘానికి తప్పుడు రిపోర్టులు పంపించాయని , ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో అంతులేని నిర్లక్ష్యం జరిగిందని ఆయన విమర్శించారు. పనులు అప్పజెప్పేంతవరకు కూడా కేంద్ర జల సంఘానికి పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వలేదన్నారు.