ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తయితే
– 3లక్షల ఎకరాలకు నీరు : మంత్రి సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 8 : ప్రాణహిత- చేవెళ్ల్ల ప్రాజెక్టు ఎత్తిపోతల పనులు పూర్తయితే జిల్లాలో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువుకట్ట పెంపు పనులను సోమవారం నాడు ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాల పనులు, అలీసాగర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు ఆదేశించారు.
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పనులను ఈఎల్‌పి, చీఫ్ ఇంజనీర్లతో సంప్రదించి ఆరు నెలల్లో పనులు పూర్తయ్యేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సారంగాపూర్ గ్రామం వద్ద ప్రాణహిత ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని అన్నారు. మహారాష్ట్రలో ఆ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు మన రాష్ట్రానికి అనుకులంగా తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు తాహేర్‌బీన్ అమ్దాన్, ఎల్లయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.