ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు..

` చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలి
` లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నేతృత్వంలో  బీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన
` గాంధీ విగ్రహం వద్ద ఎంపీల ప్లకార్డులతో ధర్నా
` బిల్లులు  ఆమోదించేంత వరకు పోరాడతాం : నామ నాగేశ్వరరావు స్పష్టీకరణ
` నూతన పార్లమెంట్‌కు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌
న్యూఢల్లీి(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనలతో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలని పార్లమెంట్‌ ఉభసభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు నినాదాలు చేశారు. తొలిరోజు సోమవారం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌ ఎంపీలు పెద్ద ఎత్తున  ఆందోళనకు దిగారు. చట్ట సభల్లో బీసీలకు,మహిళలకు రిజర్వేషన్లు బిల్లులను తక్షణమే పార్లమెంట్‌ లో  ప్రవేశపెట్టి, ఆమోదించాలని లోక్‌ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ఈ సందర్భంగా  కేంద్ర ప్రభుత్వాన్ని  డిమాండ్‌ చేశారు. నామకు మద్దతుగా పార్టీ ఎంపీలంతా సంఘటితమయ్యారు. సభ జరుగుతున్నంత సేపు నామ నేతృత్వంలో ఎంపీలు ఆందోళన కొనసాగించారు .గాంధీ విగ్రహం ఎదుట ధర్నా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లోనే  మహిళా, బీసీ రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని  మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డ్స్‌ పట్టుకుని ధర్నా నిర్వహించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ లోక్‌ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా, బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో  ప్రవేశపెట్టి, ఆమోదించేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదని అన్నారు.ఈ విషయం సీఎం కేసీఆర్‌ కూడా ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు .ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌ సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు.
నూతన పార్లమెంట్‌కు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పేరు పెట్టాలి : ఎంపీ నామా నాగేశ్వరరావు
కొత్త పార్లమెంట్‌ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని బీఆర్‌ఎస్‌ లోక్‌ సభా పక్ష నాయకుడు, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పార్లమెంట్‌ లో ఎంపీ నామ మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మెరుగైన సుపరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నంబర్‌ వన్‌గా ఉందని పేర్కొన్నారు.అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నూతన సచివాలయానికి బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టడమే కాకుండా హైదరాబాద్‌లో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతిగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా దళిత బంధు పథకం ప్రవేశపెట్టి, దళితులకు రూ.10 లక్షల వంతున వారి అభివృద్ధికి సాయం చేస్తున్నారని చెప్పారు.ఇంకా రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్‌ ఇస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నేడు కేసీఆర్‌ సుపరిపాలన వల్ల తెలంగాణ అన్నింటా నబర్‌ వన్‌గా ఉందన్నారు. ఇదే పార్లమెంట్‌లో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే, వ్యతిరేకిస్తే ఉపసంహరించుకున్న సంగతిని, 2014లో ఏపీ రీ ఆర్గనేషన్‌ యాక్ట్‌ ఆమోదాన్ని గుర్తు చేశారు.ఈ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లోనే బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, అమోదించాలని నామ పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి లేఖ కూడా రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు.