ప్రిగోజిన్‌ను మేం చంపలేదు: రష్యా

మాస్కో(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా పోరాడిన కిరాయి సైన్యం ‘వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి యెవ్‌గెని ప్రిగోజిన్‌ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే, అతడిది ప్రమాదవశాత్తు సంభవించిన మరణం కాదని, రెండు నెలల క్రితం వాగ్నర్‌ గ్రూప్‌ చేసిన తిరుగుబాటును మనసులో పెట్టుకుని రష్యా అధ్యక్షుడు పుతినే ప్రిగోజిన్‌ను హత్య చేయించాడని పశ్చిమ దేశాల అధినేతలు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో రష్యా క్లారిటీ ఇచ్చింది. వాగ్నర్‌ చీఫ్‌ను తామే హత్య చేయించామంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్ధమని చెప్పింది. ప్రిగోజిన్‌ను తాము హత్య చేయించలేదని స్పష్టం చేసింది. పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. కాగా, రష్యా సేనలకు మద్దతుగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేసిన వాగ్నర్‌ గ్రూప్‌.. రెండు నెలల క్రితం రష్యాపై తిరుగుబాటు చేసి కలకలం రేపింది.ఆ తర్వాత బెలారస్‌ అధ్యక్షుడి జోక్యంతో ఆ తిరుగుబాటు సమస్య సద్దుమణిగింది. తిరుగుబాటును విరమించుకున్న అనంతరం ప్రిగోజిన్‌కు బెలారస్‌ అధ్యక్షుడు ఆశ్రయం ఇచ్చాడు. ఈ క్రమంలో గత బుధవారం మాస్కోలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్‌ మరణించాడు. ప్రమాదానికి గురైన విమానం ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌ పేరు ఉన్నదని రష్యా ప్రకటించింది.