ప్రిన్స్ కోసం ముస్తాబవుతున్న ముంబై

ముంబై : ముంబై సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. బ్రిటన్ యువరాజుకు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, ఆయన సతీమణి కేట్ మిడిల్‌టన్ ఈ నెల 10 నుంచి మన దేశంలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన ముంబై నుంచి ప్రారంభమవుతుంది. తాజ్ మహల్ ప్యాలెస్‌లో వీరిద్దరూ బస చేస్తారు. దిలీప్ వెంగ్‌సర్కార్ క్రికెట్ మైదానంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని బాలలతో కలిసి క్రికెట్ ఆడతారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పాల్గొంటారు.
అనంతరం దక్షిణ ముంబైలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తాజ్ క్రిస్టల్ రూమ్‌లో క్రీడలు, వ్యాపార, బాలీవుడ్ దిగ్గజాలతో విలియమ్స్, కేట్ పరిచయ కార్యక్రమం, విందు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులను బ్రిటిష్ హైకమిషన్ ఆహ్వానించింది. అతిథులకు వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రాలను అందజేసింది. అతిథులు తమతోపాటు ఎవర్నీ తీసుకురాకూడదని ఆదేశాలిచ్చింది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సహాయకులు వంటివారిని కూడా తీసుకురాకూడదని స్పష్టం చేసింది. అతిథులంతా సాయంత్రం ఏడున్నర గంటలకు హాజరు కావాలని, రాజ దంపతులు రెడ్ కార్పెట్‌పై దర్శనమిస్తారని ప్రకటించింది.
ఆహ్వానాలను అందుకున్న బాలీవుడ్ ప్రముఖుల్లో షారూఖ్, ఆమిర్, కరణ్ జోహార్, రిషి కపూర్, నీతు కపూర్, అభిషేక్, ఐశ్వర్య దంపతులు, హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అలియా భట్, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ ఉన్నారు. వ్యాపార దిగ్గజాలు ఆనంద్, అనురాధ మహీంద్ర, రాహుల్ బజాజ్, అశోక్ హిందుజా, హర్ష్ గోయెంకా కూడా ఆహ్వానాలు అందుకున్నారు.
అతిథులకు థాలీ డిన్నర్ ఇస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శంకర్ మహదేవన్, ఆయన కుమారుడు సిద్ధార్థ్ సంగీత విభావరి, షియామక్ దేవర్స్ డ్యాన్స్ అకాడమీ నృత్యాలు ఉంటాయి.
2itig0yi