ప్రియుడు తో కలిసి భర్తను చంపించిన భార్య — అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
మోత్కూరు ఆగస్టు 14 జనం సాక్షి : అక్రమ సంబంధానికి అడొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య అంతమొందించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సోమవారం భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్య వివరాలను వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజు పల్లి గ్రామానికి చెందిన సల్ల సైదులు (35) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సైదులుకు శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. గత మూడు సంవత్సరాలుగా ధనలక్ష్మి అదే గ్రామానికి చెందిన ఎడ్ల నవీన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ధనలక్ష్మి తన పై అనుమానం వచ్చి వేధిస్తున్నాడని సైదులను అంతమొందించాలని నిర్ణయించుకొని నవీన్ ను కోరింది. పథకం ప్రకారం ఈనెల పదవ తేదీన ధనలక్ష్మి అమ్మగారిల్లు అయిన గురజాలకు బోనాల పండుగ కోసం వెళ్ళింది. భర్త సైదులు కూడా బోనాల పండుగకు వెళ్లడంతో 11వ తేదీన ఎడ్ల నవీన్ సైదులును మద్యం తాగడానికి తీసుకొని వెళ్ళాడు. నవీన్ సొంత మేనల్లుడైన తాటిపాముల స్వామి సహాయంతో సైదులును చంపడానికి పథకం వేసి ఆటోలో ఎక్కించుకొని అమ్మనబోలుకు తీసుకుని వెళ్ళి అక్కడ సైదులుకు ఎడ్ల నవీన్, తాటిపాముల స్వామి ఇద్దరు మద్యం తాగించారు. సైదులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆటో స్టార్ట్ చేసే తాడుతో సైదులు మెడకు తాడు కట్టి గట్టిగా బిగించారు. తర్వాత చనిపోయాడో లేదో అని వాళ్ళిద్దరు ఆటోను మోత్కూరు మండలం పొడిచేడు దగ్గర వున్న మూసినది బ్రిడ్జి పక్కన మట్టి రోడ్డులోకి తీసుకెళ్లి సైదులును కిందపడవేసి శ్వాస వుందో లేదో అని చూసి మరోసారి ఇద్దరూ కలిసి చెరొక వైపు తాడుతో గొంతును గట్టిగా బిగించి చంపేశారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో నేరస్తులు ఎడ్ల నవీన్, తాటిపాముల స్వామి ఆటో ఏపీ 24 టి ఏ 7074 నెంబర్ గల ఆటోలో హైదరాబాద్ పారిపోతుండగా అనాజీపురం వద్ద పట్టుకున్నారు. నవీన్, స్వామి నిజం ఒప్పుకోగా సల్ల ధనలక్ష్మిని తన తల్లిగారింటి వద్ద గురజాలలో ఉండగా పట్టుకొని వారి నుంచి హత్య కు ఉపయోగించిన తాడు, ఆటో, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రవికుమార్, చౌటుప్పల్ ఏసిపి మొగిలయ్య, రామన్నపేట సీఐ మోతి రాం, మోత్కూర్ ఎస్సె శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.