ప్రేక్షకులు లేకుండానే తొలి టెస్ట్‌

ఒమిక్రాన్‌ వ్యాపించకుండా దక్షిణాఫ్రికా నిర్ణయం
జోహాన్స్‌బర్గ్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బయలుదేరిన టీమిండియా త్వరలో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడబోతోంది. కానీ అక్కడ ఒమిక్రాన్‌ కేసులు తీవ్రంగా ఉండడంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు సెంచురియాన్‌లో జరగబోయే తొలి టెస్టు మ్యాచ్‌ ఖాళీ స్టేడియంలో జరుగనుంది. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌ వీక్షించడానికి క్రికెట్‌ ప్రేమికులు సమూహంగా వస్తే ఇన్‌ఫెక్షన్‌ కేసలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించి అక్కడ క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అందుకోసమే మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను విక్రయించలేదు.ఇదిలా
ఉండగా.. జనవరి 3 నుంచి 7 వరకు వాండరర్స్‌ స్టేడియంలో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌లో ప్రేక్షకులను అనుమతించాలా లేదా అనే అంశంపై క్రికెట్‌ బోర్డు స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే టీమిండియా డిసెంబర్‌ 17న సౌతాప్రికా చేరుకొని ఒకరోజు క్వారంటైన్‌లో గడిపిన తరువాత ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా మొదలు పెట్టింది. అంతకుముందు భారత్‌లోనే టీమిండియా జట్టు సభ్యులందరికీ మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచి మూడుసార్లు కరోనా టెస్టులు నిర్వహించారు.