ప్రేమకు రెండు ప్రాణాలు బలి

 imageattacknew12-18-1468830172-19-1468909941గుంటూరు: గుంటూరు నిజాంపట్నం మండలం మహ్మదీయపాలెంలో జరిగిన ప్రేమికుల మృతి ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ప్రేయసి జాస్మిన్ ఆత్మహత్య చేసుకోగా, ప్రియుడు శ్రీసాయి గ్రామస్థుల దాడిలో మరణించాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గ్రామంలో ప్రతీకార జ్వాలలు రుగులుతున్నాయి. నిజాంపట్నం మండలంలోని అడవులదీవి శివారు గ్రామమైన మహ్మదీయపాలెం గ్రామానికి చెందిన జాస్మిన్, అదే ప్రాంతానికి చెందిన శ్రీసాయి గత ఏడాదికాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. జాస్మిన్‌కు మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈవిషయాన్ని ఆదివారం తన స్నేహితురాలి ద్వారా జాస్మిన్ శ్రీసాయికి సమాచారం అందించింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో జాస్మిన్ శ్రీసాయికి ఫోన్ చేసిందని గ్రామస్థుల దాడిలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీసాయి మిత్రుడు పవన్ చెప్పాడు. జాస్మిన్ తండ్రి మృతిచెందగా తల్లి మెహరున్నీసా కూలిపనులు చేసుకుని జీవిస్తోంది. ఎప్పటిలాగే మెహరున్నీసా ఆదివారం కూలిపనికి వెళ్లింది. శ్రీసాయి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ విద్యార్థి. జాస్మిన్ సమాచారం అందుకుని తన స్నేహితుడు పవన్‌కుమార్‌తో కలిసి ఆదివారం మధ్యాహ్నం జాస్మిన్ ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన స్థానికుడొకరు ఆమె బంధువు అయిన గౌస్‌కు సమాచారం అందించాడు. దీంతో గౌస్ ఆగమేఘాలపై ఇంటికి చేరుకుని వారిని వారించాడు. శ్రీసాయి, పవన్‌కుమార్‌లను ఇంటి నుంచి పంపించి జాస్మిన్‌ను మందలించినట్లు స్థానికులు చెపుతున్నారు. కొద్దిసేపటి అనంతరం గౌస్ బయటకువెళ్లాడు. ఆ వెంటనే శ్రీసాయితోపాటు అతని స్నేహితుడు పవన్ జాస్మిన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు.గౌస్ వెళ్లిపోగానే విషయం తన అన్నయ్యకు తెలిసిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని జాస్మిన్ ఫోన్ చేయడంతో తాను, శ్రీసాయి మరో ఇద్దరితో కలిసి ఇంట్లోకి వెళ్లినట్లు పవన్ కుమార్ చెప్పాడు. లోపలికి వెళ్లగానే జాస్మిన్ ఉరి వేసుకోవడాన్ని గమనించి ఎదురింట్లో నివసిస్తున్న వారికి సమాచారం అందించారు. అనంతరం మృతురాలి బంధువు గౌస్ అక్కడికి చేరుకున్నాడు. శ్రీసాయి, పవన్ కూడా మృతురాలి ఇంటి లోపలకు వెళ్లగా వారిని లోపలకు నెట్టి గౌస్ తలుపులు బిగించాడు. స్థానికులను పిలిచి పరిస్థితిని వివరించగా రెచ్చిపోయిన గ్రామస్థులు సాయి, పవన్‌లను చితకబాది చెట్టుకు కట్టేశారు. శ్రీసాయి అపస్మారక స్థితికి చేరాడు. సమాచారం అందుకున్న అడవులదీవి పోలీసులు ముందుగా భట్టిప్రోలు ఆసుపత్రికి తరలించి, అక్కడినుంచి అత్యవసర చికిత్స కోసం రేపల్లెకు తరలిస్తుండగా అతను మృతిచెందాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జాస్మిన్ ఉరి వేసుకోలేదని శ్రీసాయి, పవన్‌కుమార్ ఆమెను కొట్టి హతమార్చారని మృతురాలి ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలతో రేపల్లెలో చికిత్స పొందుతున్న పవన్‌కుమార్ ఇచ్చిన వాంగ్మూలం మరోరకంగా ఉంది. జాస్మిన్‌ను గౌస్ తీవ్రంగా మందలించినందునే ఉరివేసుకుందని, దీంతో అతను తప్పించుకునేందుకు తమను గదిలో ఉంచి తలుపులు వేసి గ్రామస్థులను కూడగట్టి దాడిచేశారని పవన్‌కుమార్ పోలీసులకు వివరించాడు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. శ్రీసాయి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, సన్నిహితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రేమించిన నేరానికి అతన్ని హతమార్చారని ఆరోపిస్తూ జాస్మిన్ ఇంటి వద్ద వందలాది మంది ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. శ్రీసాయి హత్య వెనుక పరోక్షంగా పోలీసుల హస్తం ఉందని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవులదీవి నుంచి కూతవేటు దూరంలో ఉన్న రేపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లకుండా భట్టిప్రోలు ఆసుపత్రికి తరలించి జాప్యం చేశారని, పోలీసులు కూడా చితకబాదినందునే అతను మృతిచెందాడని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు గ్రామంలో నిషేధాజ్ఞలు విధించారు. శ్రీసాయిపై దాడిచేసిన నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు బలగాలను రంగంలో దించారు.

తాజావార్తలు