ప్రైవేటు పాఠశాలపై వేటు
శ్రీకాకుళం, జూలై 27: నిబంధనలకు విర్దుంగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజాం మండల కేంద్రంలోని డోలపేటలో గల సుధాపబ్లిక్ స్కూల్కు అక్కడి మండల విద్యాశాఖ అధికారి చిరంజీవి శర్మ తాళాలు వేశారు. నిబంధనలకు విరుద్దంగా పాఠశాల నడుపుతున్నారంటూ జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు పాలకొండ ఉపవిద్యాశాఖ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఎంఈవో వివరించారు. ఎంఈవో చిరంజీవి శర్మ ఎమ్మార్పీ సింహాచలంలు పాఠశాలకు వెళ్లి యాజమాన్యానికి డిప్యూటీ డిఈవో ఉత్తర్వులను అందజేసి తక్షణం పాఠశాలను మూసివేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్ ఎం.లక్ష్మీ నిబంధనల ప్రకారం అనుమతులు తెచ్చుకునేందుకు తమకు రెండు వారలు సమయం ఇవ్వాలని కోరారు. దీనికి ఎంఈవో ససేమిరా అన్నారు. రికార్డులను స్వాధీనం చేసుకొని పాఠశాలకు తాళాలు వేయించారు. ఇదిలా ఉండగా ఈ పాఠశాలల్లో చదివే సుమారు 500 మంది విద్యార్థుల భవితపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.