ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు: మోదీ

ఢిల్లీ:
కేరళలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌గా తీసుకున్నారు. నావికాదళ, వాయుసేనలను సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనాలని సూచించారు. దుర్ఘటన వార్త వినగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. హుటాహుటిన కేరళకు పయనమయ్యారు. కేరళలో తాను పర్యటిస్తున్న సమయంలో ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని మోదీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అగ్నిప్రమాద బాధితులను, వారి కుటుంబాలను మోదీ పరామర్శించనున్నారు. కాలిన గాయాలకు చికిత్స అందించడానికి నైపుణ్యం ఉన్న డాక్టర్ల బృందాన్ని కూడా మోదీ తనతో కేరళకు తీసుకు వెళ్తున్నారు.

కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుట్టింగళ్ దేవీ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా మృతి చెందారు. ఎక్కువ శాతం కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రులు ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది.